13-08-2025 01:07:48 AM
వికారాబాద్, ఆగస్టు- 12( విజయ క్రాంతి) ఏకంగా కలెక్టర్ కార్యాలయంలోనే ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ అధికారిని ఏసీబీకి చిక్కిన సంఘటన మంగళవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో తీవ్ర కలకలం రేపింది. ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ సెక్షన్‌లో సుజాత అనే ఉద్యోగిని జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
ఓ వ్యవసాయ భూమికి చెంది న ప్రొసీడింగ్ కాపీని నవాబుపేట్ తహసిల్దార్ కార్యాలయంకు పంపించేందుకు సదరు రైతు నుంచి అధికారిని రూ. 25,000 లంచం డిమాండ్ చేశారు. అంతగా ఇచ్చుకోలేనన్న సదరు రైతు, రూ. 20,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ మేరకు గతంలో రూ. 5000 ఆన్‌లైన్‌లో పంపించాడు. మిగతా రూ.15000 ఇస్తేనే కలెక్టర్ టేబుల్ మీద నుండి నవాబుపేట్ తహసిల్దార్ కార్యాలయంకు ప్రొసీడింగ్ పంపిస్తానని సదరు ఉద్యోగిని రైతుపై ఒత్తిడి చేశారు. ఈ మేరకు సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో మంగళవారం పథకం ప్రకారం ఆమె రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
నవాబు పేట్ మండలం వట్టిమినపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన అసైన్మెంట్ భూమిని ఓ రియాల్టర్ పట్టా భూమిగా చూపిస్తూ ఆక్రమిస్తున్నాడని, అట్టి భూమికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నాడు. కలెక్టర్ నుంచి ప్రెసిడెంట్ కాపీ వచ్చినా... తాసిల్దార్ కు పంపించడంలో కక్కుర్తి పడ్డ ఉద్యోగిని ఏసీబీ వల్ల లో చిక్కిందని పలువురు అనుకుంటున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు సదురు ఉద్యోగిని అదుపులోకి తీసుకొని కేసునమోదుచేశారు.