calender_icon.png 9 August, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాల ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు

07-08-2025 01:52:18 AM

  1. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీటీవో బద్రు నాయక్

మెదక్ జిల్లా హమ్మదాబాద్ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలోనూ తనిఖీలు 

జగిత్యాల అర్బన్, మెదక్ ఆగస్టు 6 (విజయక్రాంతి): జగిత్యాలలో ఆర్టీవో ఆఫీస్‌లో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డీటీవో బద్రునాయక్ తన డ్రైవర్ ద్వారా రూ.22 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమా ర్ తెలిపిన ప్రకారం ఈనెల 4న తనిఖీల్లో కోరుట్లకు చెందిన ఓ వ్యక్తికి చెందిన జేసీబీని పట్టుకొని అన్ని ధ్రువపత్రాలు ఉన్నా, ఇన్సూరెన్స్ లేని కారణంగా జేసీబీని సీజ్ చేస్తానని బెదిరించి రూ.40వేలు డిమాండ్ చేశారని తెలిపారు.

అయితే ఇద్దరి మధ్య రూ.35 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని, అదే రోజు జేసీబీ డ్రైవర్ ద్వారా రూ.13 వేలను డీటీవో పర్సనల్ డ్రైవర్ బానోతు అరవింద్ తీసుకున్నట్టు చెప్పారు. మిగతా రూ.22 వేలు ఇచ్చే వరకు వాహన పేపర్లను, సెల్‌ఫోన్‌ను అతడి వద్దే ఉంచుకున్నాడని పేర్కొన్నారు. దీంతో జేసీబీ యజమాని శశిధర్ ఫిర్యాదు మేరకు బుధవారం తనిఖీలు నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు చెప్పారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మహ్మదాబాద్ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం ఏసీబీ, మున్సిపల్ శానిటేషన్, లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను తనిఖీ చేసి అనంతరం పాఠశాలను పరిశీలించారు.

శిథిలావస్థకు చేరిన స్కూల్ భవనం, వంటగది అపరిశుభ్రంగా ఉండటంం, విద్యార్థులకు మరుగు దొడ్లు సరిగా లేకపోవడం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ పేరొన్నారు. హాస్టల్‌లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదనే ఫిర్యాదు మేరకే ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీకి వచ్చినట్లు తెలుస్తోంది.