calender_icon.png 7 November, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ జిల్లాలో ఏసీబీ సోదాలు

07-11-2025 01:25:12 AM

-కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు 

-డాక్యుమెంట్ రైటర్ వద్ద నగదు లభ్యం

మేడ్చల్, నవంబర్ 6 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో ఒకేరోజు రెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయడం ఆ శాఖలో కలకలం రేపింది. ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారుల సోదాలు జరిపారు. అక్రమ రిజిస్ట్రేషన్లు, అవినీతికి పాల్పడుతున్నారని ప్రజల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు గురువారం కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తనిఖీ చేశారు.

ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్‌లో తనిఖీ చేయగా, ఆ సమయంలో పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయంలోనే ఉన్నారు. అందరిని డీఎస్పీ విచారించారు. ఒకరి వద్ద రూ.పదివేల నగ దు లభించింది. మూసాపేట్‌లోని కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తాళా లు వేసి ఫైళ్లను పరిశీలించారు. కార్యాలయం లోపలికి ఎవరిని అనుమతించలేదు. సబ్ రిజిస్టర్ కోమటిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, ఇతర సిబ్బందిని విచారించారు. 

శిఖం భూమిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్!

మేడ్చల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసే భూమి ఎలాంటిది అనేది అధికారులు పరిశీలించడం లేదు. డబ్బులు అందితే చాలు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మేడ్చల్‌లోని ఎర్ర చెరువులో శిఖం భూమిలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. 1117 సర్వే నంబర్‌లో 50 ఏళ్ల క్రితం గ్రామపంచాయతీ హయాం లో ప్లాట్లు చేశారు. ఇటీవల ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురైంది. అయినప్పటికీ రసీదు ఆధారంగా రిజిస్ట్రేషన్ అధికారులు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. వల్లభ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కానాజిగూడ రెవెన్యూ పరిధిలో గ్రీన్ ఫీల్ కాలనీలో 1987లో గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో 60 ఎకరాల్లో వెంచర్ వేశారు. ఇందులో కొన్ని సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఆన్లైన్లో స్పష్టంగా ఉన్నప్పటికీ ఒక డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తిత్వం వహించడంతో అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విధంగా జిల్లాలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్‌లదే హవా నడుస్తోంది. ఒక్కో ఫైలుకు ఒక్కో రేటు మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు.