28-01-2026 12:00:00 AM
మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా
నేటినుంచి నామి నేషన్ల స్వీకరణ
అమలులోకి ఎన్నికల కోడ్
రంగారెడ్డి, జనవరి 27(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల కు ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో మున్సిపాలిటీ లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వెడిక్కింది. గత కొన్ని రోజులు గా ఆశావహులు ఎన్నికల కోసం ఉత్కంఠ గా ఎదురు చేశారు. ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో వారంతా ఎన్నికల బరి లో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ‘ఎవరికి టికెట్ దక్కుతుంది? ఎవరికి చైర్మన్ పీఠం దక్కుతుంది?‘. రిజర్వేషన్ల ప్రకటనతో అప్పటివరకు స్తబ్దుగా ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా ఊపు అందుకున్నాయి. ఆరు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి దాకా చక్రం తిప్పుతున్నాయి.
ప్రధాన పార్టీల ’గేమ్ ప్లాన్’ ఇదే.....
కాంగ్రెస్ (అధికార బలం): ప్రభుత్వ పథకాలు, ‘ఆరు గ్యారంటీలు’ తమను గట్టెక్కిస్తాయని ధీమాగా ఉంది. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. ‘గెలిచే గుర్రాలకే టికెట్‘ అనే సూత్రంతో ప్రైవేట్ ఏజెన్సీలను రంగం లోకి దింపి సర్వేలు చేయిస్తోంది.
బీఆర్‌ఎస్ (పట్టు నిలుపుకునే ప్రయత్నం): గత పదేళ్ల అభివృద్ధిని చూపిస్తూ, పటిష్టమైన క్యాడర్ కలిగిన గులాబీ పార్టీ.. సెటిలర్లు, స్థానికుల ఓట్లపై కన్నేసింది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పట్టును కోల్పోకుండా జాగ్రత్త పడుతోంది.
బీజేపీ (సత్తా చాటాలని): కేంద్ర ప్రభుత్వ పథకాలు, హిందూత్వ ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో కొన్ని చోట్ల రెండో స్థానంలో నిలిచిన ఉత్సాహంతో, ఈసారి చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది.
మున్సిపాలిటీల వారీగా ’హాట్ సీట్లు’ - విశ్లేషిస్తే...
మున్సిపాలిటీ వారిగా విశ్లేషణ
షాద్‌నగర్ బీసీ జనరల్ ఇక్కడ బీసీ ఓటర్ల జనాభా ఎక్కువ. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన పట్టు నిరూపించుకోవాల్సిన చోటు ఇది.
మొయినాబాద్ ఎస్సీ జనరల్ తొలిసారి మున్సిపల్ ఎన్నికలు. కొత్త పాలకవర్గం కోసం ప్రజల ఆసక్తి.
చేవెళ్ల, శంకర్ పల్లి లు జనరల్ కావడం తో ఎమ్మెల్యే కాలె యాదయ్య వర్గం వర్సెస్ భీంభరత్ వర్గం మధ్య టికెట్ల యుద్ధం తారాస్థాయికి చేరింది.
ఇబ్రహీంపట్నం జనరల్ మల్రెడ్డి రంగారెడ్డి మార్క్ రాజకీయం. ఆశావహుల సంఖ్య అత్యధికంగా ఉన్న మున్సిపాలిటీ.
ఆమనగల్లు మున్సిపాలిటీ లో.... ఆమనగల్లులో ప్రధానంగా సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి వెళ్లడంతో, అగ్రవర్ణాలకు చెందిన బలమైన నేతలతో పాటు ఆర్థికంగా పటిష్టంగా ఉన్న బీసీ నాయకులు కూడా పీఠంపై కన్నేశారు.
కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఆమనగల్లులో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ఇది ప్రతిష్టాత్మకమైనది. పార్టీలోని పాత కాంగ్రెస్,కొత్తగా పార్టీ లో చేరిన వారికి మధ్య సమతుల్యత పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. బీఆర్‌ఎస్ లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అనుచరులు చాలామంది తమ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు.
బీజేపీ పార్టీకి వస్తే జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి స్వంత ఇలాక. మొదటి సారి మున్సిపాలిటీ ఎన్నికలలో బీజేపీ పాగా వేసింది మళ్ళీ పట్టు నిలుపు కోవాలని చూస్తుంది.
ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతుండటంతో, ఇక్క డ త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది.
ఆశావహుల ‘ప్రదక్షిణలు’.. నాయకుల ‘కండీషన్లు’!
టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఇప్పుడు నియోజకవర్గ ఇన్-ఛార్జులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్దే మకాం వేస్తున్నారు. అయితే నాయకులు మాత్రం కొన్ని కఠినమైన షరతులు విధిస్తున్నారు: ప్రచార ఖర్చులను భరించే స్తోమత ఉండాలని, సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గాన్ని కలుపుకుపోయే సామర్థ్యం ఉండాలని,వార్డులో మెజారిటీ ఓటర్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయా పార్టీ లు పావులు కడుపుతున్నారు.
ఓటరు నాడి ఎటు?
జిల్లా వ్యాప్తంగా 1,75,974 మంది ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్ల సంఖ్యే (88,527) ఎక్కువగా ఉంది. ఎన్నికల గెలుపు లో వీరే కీ రోల్ ఉంటుంది. మహిళా సాధికారత, మౌలిక సదుపాయాలు (డ్రైనేజీ, తాగునీరు) ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారే అవకాశం ఉంది. మున్సిపల్ వార్డుల విభజన, రిజర్వేషన్ల లెక్కలు తేలడంతో ఇప్పుడు బంతి నాయకుల కోర్టులో ఉంది. ఒక్కో వార్డులో 3 నుంచి 5 మంది పోటీపడుతుండటంతో అసమ్మతి సెగలు కూడా రాజుకుంటున్నాయి. చూడాలి మరి రెండు మూడు రోజులలో పార్టీల వారిగా బరి లో నిలిచే వారి పై క్లారిటీ వస్తుంది.