28-01-2026 12:25:31 AM
ముస్తాబైన అమ్మవారి గద్దెలు
కరీంనగర్, జనవరి 27 (విజయ క్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వందకు పైగా ప్రాంతాల్లో నేటి నుండి సమ్మక్క జాతర జరగనుంది. ఇందుకు సంబంధించి అమ్మవార్ల గద్దెలు ముస్తాబైనాయి. మినీ మేడారాలుగా పిలువబడే రేకుర్తి. వీణవంక, గోదావరిఖని, కేశవపట్నం, గోయల్వాడ, నీరుకుళ్ల, కొదురుపాక, కొలనూరులకు భక్తులు పోటెత్తనున్నారు. ఆదివాసీ వనదేవతలు సమ్మక్క- సారలమ్మ జాతర ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గోదావరిఖనిలో జరిగే జాతరకు సింగరేణి ఉద్యోగులతోపాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఏటా వస్తుంటారు. లక్షలాది మంది భక్తులు తరలిరానుండడంతో సిం గరేణి, ఎన్టీపీసీ, రామగుండం బల్దియా ఆధ్వర్యంలో జాతరలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్కసారలమ్మ జాతరకు ఈ ఏడాదితో 50 ఏళ్లు నిండను న్నాయి. ఈ సందర్బంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. మొదటి నుంచి ఈ జాతరను పాడి సుధాకర్ రెడ్డి కుటుంబమే నిర్వహిస్తోంది.
ఇటీవల జాతరకు సంబంధించిన భూమిపూజను ఆయన తనయుడు ఉదయనందన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. స్వర్ణోత్సవ జాతర వేడుకలను ఘనంగా నిర్వ హిం చేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి జాతరకు రావాలని సీఎంతోపాటు రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ఎమ్మె ల్యేలు, స్థానిక సర్పంచులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మీడి యా ప్రతినిధులు, ఇతర ప్రముఖులను ఆయన ఆహ్వానించారు.
రేకుర్తిలో జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్థానిక మాజీ కార్పొరేటర్ సూదగోని మాధవి కృష్ణ గౌడ్ తో కలసి ఏర్పాట్లను పరువేక్షించారు. ప్రసిద్ధి చెందిన జాతరలతో పాటు గ్రామస్థాయిలోనూ అనేక చోట్ల సమ్మక్క-సారల మ్మ జాతర్లకు ఏర్పాట్లు చేశారు. ప్రధాన జాతర్లతోపాటు ఉ మ్మడి జిల్లావ్యాప్తంగా మరో 100 చోట్ల జాతరలు జరుగుతాయని అంచనా.
కరీంన గర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి, చింతకుంట, మల్కాపూర్, రామడుగు మండలం గోపాల్రావు పేట, రామడుగు, కొరటపల్లి, గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామాల్లో జాతర నిర్వహణకు గ్రామాల్లో సర్పంచులు, పట్టణాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జమ్మికుంట మండలం తనుగుల, కేశవపురం, వావిలాలతోపాటు ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో సమ్మక్క-సార లమ్మ జాతర ఏర్పాట్లను అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.
గన్నేరువరం మండలం మైలారం, గన్నేరువరం, శంకరపట్నం మండలం కేశవపట్నం, ఆముదాలపల్లి, చొప్ప దండి మండలంలో చొప్పదండి పట్టణం, ఆర్న కొండ, రాగంపేట, గుమ్లాపూర్, కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల, నగునూర్, బొమ్మ కల్, వీణవంక మండలంలో వీణవంక, చల్లూరు, కోర్కల్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో జాతర్ల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుళ్ల మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తినాయి. ఆర్డీవో గంగయ్య పరిశీలించారు. ఇక్కడి జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
బంగారం(బెల్లం) కు డిమాండ్...
కోరిన కోరికలు తీర్చే తల్లులకు భక్తులు తమ వంతుగా నిలువెత్తు బంగారం (బెల్లం) తులాభారం సమర్పించటం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అందుకే జాతర వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బెల్లం అమ్మకాలు ఊపందుకున్నాయి. వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని వ్యాపారస్తులు ఇతర ప్రాంతాల నుంచి బెల్లం దిగుమతి చేసుకుంటున్నారు. గతంలో కామారెడ్డి, నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాందేడ్, లాథూర్, పుణే, కర్ణాటకలోని బీదర్, మాండియా ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. లాభాల ఆశతో రవాణా ఛార్జీలు, ధర చౌకగా చూసుకుని ఆయా ప్రాంతాల నుంచి తెప్పించి కిలో 45 రూపాయలకు అమ్ముతున్నారు.