13-08-2025 12:00:00 AM
మృతుడి కుటుబానికి న్యాయం చేయాలని కార్మికుల డిమాండ్
యాదాద్రి భువనగిరి ఆగస్టు 12 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో మంగళవారం ఉదయం ఈఎం బిల్డింగ్‌లో స్టీమ్ వ్యక్యూమ్ ఛాంబర్ పేలి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గోదావరి ఖనికి చెందిన సదానందంగా గుర్తించారు. 20 ఏళ్ల క్రితం సదానందం గోదావరిఖని నుంచి పెద్ద కందుకూరు కంపెనీకి బదిలీ అయి ఆలేరులో నివాసముంటున్నాడు.
ఎప్పటిలాగానే మంగళవారం కంపెనీలో పనిచేస్తుండగా ఒక్కసారిగా ఛాంబర్ పేలడంతో సదానందం అక్కడిక్కడే మరణించా డు. దీంతో ఆయన కుటుంబంలో, కార్మికుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన సదానందంకి భార్య అఖిల, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుళ్లు జరిగిన స్థలాన్ని పరిశీలించి ఎలా జరిగిందని కంపెనీ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికుడు సదానందం మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల ను పరామర్శించారు.
మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి
మృతుడి కుటుంబాన్ని కంపెనీ యాజమాన్యం ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారంతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపించారు.
రూ.2 కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
పెద్ద కందుకూరు ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికుడు సదానందం మృతి చెందాడని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ఆరోపించారు. మృతుడి కుటుంబానికి పరిశ్రమ యాజమాన్యం రెండు కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాం డ్ చేశారు.
ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో ప్రతిసారి పేలుళ్లు జరగడం.. కార్మికుల ప్రా ణాలు గాలిలో కలిసిపోవడం జరుగుతున్నాయని అయినా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.