01-10-2025 02:10:31 AM
ప్రభుత్వానికి బాధితుడు సయ్యద్ మీర్ విజ్ఞప్తి
ఖైరతాబాద్; సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి) : తన పేరిట రిజిస్ట్రేషన్ అయిన భూమిని కాజేసేందుకు యత్నిస్తున్న వారి నుంచి తనకు, తన స్థలానికి రక్షణ కల్పించాలని బాధితుడు నయ్యద్ మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయవాది కిశోర్ కుమార్, బాలాజీ, ఎండి. అహ్మద్, మారుతీరావుతో కలిసి మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేట్ గ్రామంలో సర్వే నం.78లో రెండెకరాల 30గుంటల స్థలాన్ని మహ్మద్ కుద్రత్ ఉన్నిసా బేగం అనే మహిళ వద్ద 1985లో కొనుగోలు చేశానని తెలిపారు. పంచాయతీ లే అవుట్ లో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశానని తెలిపారు. గతంలో కొంతమంది నా స్థలాన్ని కాజేసేందుకు చూసినా హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పిచ్చిందన్నారు.
గత పదిరోజులుగా ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన వారమని చెప్తూ సదరు స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ స్థలంపై న్యాయస్థానం స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా అధికారులు స్పందించడంలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తన భూమిని తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు.