01-10-2025 02:10:39 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : కెనడాలో నివాసం ఉంటున్న తనకు చెప్పా పెట్టకుండా జర్మనీకి వెళ్లిపోయిన భర్త ముజమిన్ గులాబ్ నాయక్ వాడి ఆచూకీ కనుగొని న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఓల్డ్ మలక్ పేట్‌కు చెందిన షబానా నస్రీన్ అహ్మద్ సీఎం ప్రజావాణిలో అర్జీ దాఖలు చేశారు. ఈ అంశంపై స్పందించిన రాష్ర్ట ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రికి లేఖ రాసి నస్రీన్‌కు న్యాయం చేయాలని కోరారు.
శేషాద్రి ఆదేశాల మేరకు రాష్ర్ట సచివాలయ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఎన్నారై విభాగం అధికారులు జర్మనీ, కెనడా ఇండియన్ ఎంబసీలకు, కేంద్ర ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖలకు లేఖ రాశారు. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేయాలని ఎన్నారై మహిళా విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను కోరుతూ కూడా లేఖ రాశారు. ఈ మేరకు సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డికి జీఏడీ ఎన్నారై విభాగం జాయింట్ సెక్రెటరీ శివలింగయ్య తిరుగు సమాధానం ఇస్తూ లేఖ రాశారు.
ఈ వ్యవహారం అంతా చకచకా నాలుగు రోజుల్లో జరిగిపోయాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముజామిన్‌తో ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగిందని, కెనడా నుంచి ఇండియాకు రావాలంటే తన నాలుగేళ్ల బిడ్డకు ఇండియన్ పాసుపోర్టు సహా పలు డాక్యుమెంట్స్‌పై తండ్రి సంతకాలు అవసరం అని, భర్త ఆచూకీ కోసం షబానా నస్రిన్ ఇచ్చిన పవర్ ఆఫ్ ఆటార్నీ ద్వారా ఆమె తల్లి సెప్టెంబర్ 19న సీఎం ప్రజావాణిలో అర్జీ ఇచ్చారు. చిన్నారెడ్డి తక్షణ స్పందనతో రాష్ర్ట ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. నస్రీన్‌కు న్యాయం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది.