22-11-2025 01:45:46 AM
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్
సిద్దిపేట క్రైం, నవంబర్ 21 : ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించాలనే లక్ష్యంతో శుక్రవారం స్థానిక సీతారామాంజనేయ థియేటర్, పాత బస్టాండ్, సెంట్రల్బ్యాంక్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డును ఆక్రమించి పండ్ల వ్యాపారం చేస్తున్న తోపుడు బండ్ల యజమానులతో మాట్లాడారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేయొద్దని, స్థిర ప్రదేశంలో వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. తమ సూచనలను పాటించనివారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.
వినూత్న రీతిలో ప్రచారం
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు ముస్తాబాద్ చౌరస్తా వద్ద వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఆర్కే టెడ్డీ ఈవెంట్ నిర్వాహకులు టెడ్డీబేర్ వేషం ధరించి బ్యానర్లతో ట్రాఫిక్ నియమాలను సూచించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అతి వేగాన్ని నియంత్రించడం వంటి అంశాలను వివరించారు.వినూత్న కార్యక్రమంపై స్థానికులు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్త్స్ర విజయభాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.