22-11-2025 01:44:19 AM
చేగుంట/ చిన్నశంకరంపేట, నవంబర్ 21 :మెదక్ జిల్లా చేగుంట, చిన్నశంకరంపేట మండలంలో శక్తి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం రైతులను నిలువునా మోసం చేసిందని రైతులు వాపోయారు. 2024 యాసంగి సాగులో రైతులకు ఆడ, మగ విత్తన ఉత్పత్తి పంట కొరకై ఎస్సార్ 30 అనే రకం వడ్లను చందంపేట, శంకరంపేట, శాలిపేట, గజగట్లపల్లి, పోలంపల్లి, సంకాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల రైతులకు విత్తనోత్పత్తిని పంపిణీ చేశారు.
తమ విత్తనం వాడితే అధిక దిగుబడి, లాభం వస్తుందని రైతులను నమ్మించి పంట వేయించారు, కంపెనీ వారు ఈ పంటను ఆడ విత్తనాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని మాట ఇచ్చి, ఒక క్వింటాకు 12 వేల రూపాయల చొప్పున కొంటామని చెప్పినట్లు తెలిపారు. ఒకవేళ దిగుబడి రానీపక్షంలో ఒక ఎకరానికి నష్టపరిహారం కింద రూ.75,000 చెల్లిస్తామని రైతులకు చెప్పారని తెలిపారు.
పండించిన ధాన్యం తీసుకొని వెళ్ళిన రోజు నుంచి 45 రోజులలోపు మొత్తం డబ్బులు చెల్లిస్తామని హామీనిచ్చారని, తీరా ఇప్పుడు రైతులు డబ్బులు అడగగా మీరు పండించిన పంట మాకు సరిగ్గా రాలేదని, డబ్బులు చెల్లించడం కుదరదని, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ రైతులను బెదిరిస్తున్నట్లు చేగుంట మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన కొండి శ్రీనివాస్ వాపోయారు. మండలంలో ఉన్న రైతులు అందరు కలిసి ఆర్గనైజర్లు, సూపర్వైజర్లను డబ్బులు అడగగా కంపెనీ యాజమాన్యం ఎంత ఇస్తే అంత ఇస్తామని, తామేం చేయలేమని సమాధానమిస్తున్నట్లు తెలిపారు.
దీంతో మండలంలో ఉన్న రైతులందరూ కలిసి సూపర్వైజర్ తీసుకొని హైదరాబాద్ కు నాలుగు సార్లు కంపెనీ యాజమాన్యం వద్దకు వెళ్ళడంతో రైతులకు సగం డబ్బులు మాత్రమే ఇచ్చారని, మిగతా డబ్బులను ఐదు నెలలు గడుస్తున్నా చెల్లించడం లేదన్నారు. మిగతా డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నారని వాపోయారు, పంటను పండించి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు కంపెనీ యజమాన్యం, ఆర్గనైజర్, సూపర్వైజర్ స్పందించడం లేదన్నారు. తాము శక్తి సీడ్ కంపని యాజమాన్యం వల్ల మోసపోయామని, వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.