15-08-2025 01:50:40 AM
ఇల్లందులో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో
వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా
ఇల్లందు టౌన్, ఆగస్టు 14 (విజయక్రాంతి): యూరియా కొరతను నివారించి రైతాంగానికి సరిపడా యూరియాను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం సిపిఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్లో రాస్తారోకో నిర్వహించి, అనంతరం వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు, ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతాంగానికి సరిపడా యూరియాను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు.
యూరియా కొరకు రైతాంగం నెల రోజుల నుండి పనులు మానుకొని విక్రయ కేంద్రాల వద్ద క్యూలో నిలబడి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు దేశానికి వెన్నెముకని, రైతే రాజు అంటూ రైతన్న సమస్యలను పాలకులు విస్మరిస్తున్నారన్నారు. యూరియా కొరకు నెల రోజులుగా రైతాంగం ఆందోళనలు చేస్తున్నప్పటికిని ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రైతాంగానికి సరిపడ యూరియాను అందించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ రేపటినుండి యూరియాను అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ జిల్లా సహాయకార్యదర్శి గౌని నాగేశ్వరరావు, మండల సహాయ కార్యదర్శి వాంకుడోత్ మోతిలాల్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి, పిడిఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూక్య శ్యామ్ డి.ప్రణయ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.