30-09-2025 12:00:00 AM
దౌల్తాబాద్, సెప్టెంబర్ 29: ఇటీవల వెలువడిన గ్రూప్1 ఫలితాల్లో దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఆది దీక్షిత డీఎస్పీగా ఎంపిక కావడం విశేషం. ఈ విజయం కేవలం వ్యక్తిగత ప్రతిభ మాత్రమే కాకుండా కుటుంబం, గురువులు, గ్రామం కలసి గర్వపడే ఘట్టం. మధ్య తరగతి కుటుంబం మహా విజయ లక్ష్యం దీక్షిత చిన్ననాటి నుంచే మధ్య తరగతి కుటుంబంలో పెరిగింది. తండ్రి ఆది వెంకన్న, తల్లి ఆది రేఖ వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి జీవనం సాగించారు. కానీ తమ కూతురు చదువులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలగన్నారు.ఆ కలను నిజం చేయడమే తన ధ్యేయంగా భావించారు.
వివేకానంద పాఠశాలలో పునాది
స్థానికంగా ఉన్న వివేకానంద పాఠశాలలోనే దీక్షిత తన విద్యాభ్యాసాన్ని చేశారు. అక్కడి గురువుల మార్గదర్శకత, క్రమశిక్షణ, సమయపాలన తనకు పునాది వేసింది. పాఠశాల రోజుల్లోనే జీవితంలో పెద్దదిగా ఆలోచించాలి, కష్టపడాలి అనే విలువలు తనలో నాటుకుపోయాయి.
‘ ప్రయత్నం పట్టుదల విజయం
గ్రూప్1 పరీక్షలకు సన్నద్ధమవడం చిన్న విషయం కాదు. రోజంతా చదువులో మునిగిపోవడం, వైఫల్యాలను తట్టుకోవడం, మళ్లీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడం దీక్షిత అలవాటు చేసుకుంది. ఒకవైపు కుటుంబ పరిస్థితులు కష్టంగా ఉన్నా, మరోవైపు ఆశయానికి కట్టుబడి చదువుతోనే తన భవిష్యత్తును నిర్మించుకున్నది. చివరికి డీఎస్పీ ఉద్యోగం సాధించడం తన పట్టుదలకు నిదర్శనం.
‘ యువతకు ఆదర్శం
ఈ విజయంతో దీక్షిత, దౌల్తాబాద్ యువతకు ఆదర్శంగా నిలిచింది. కష్టానికి ఫలితం తప్పక ఉంటుంది అనే నమ్మకాన్ని తన జీవితంతో నిరూపించింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న అనేక మంది యువతకు దీక్షిత ప్రయాణం ప్రేరణగా మారింది.
మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఒక సాధారణ యువతి కష్టంతో, పట్టుదలతో, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో డీఎస్పీ స్థాయి వరకు చేరుకోవడం నిజంగా విశేషం. దౌల్తాబాద్ పేరు వెలుగులోకి తీసుకొచ్చిన ఆది దీక్షితకు భవిష్యత్తు మరింత వెలుగొందాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.