calender_icon.png 11 July, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ కల్లు ఘటన.. ఏడుకు చేరిన మృతులు

11-07-2025 12:00:00 AM

  1. 37 మందికి అస్వస్థత,నలుగురి పరిస్థితి విషమం
  2. కల్లులో అల్ఫ్రాజోలం కలిపినట్టు నిర్ధారణ 
  3. కల్లు దుకాణాల లైసెన్సులు సీజ్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటన లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. మంగళవారం రాత్రి వెలుగుచూసిన ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. గురువారం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సమ్మ (54) అనే మరో బాధితురాలు ప్రాణాలు కోల్పోవడం తో విషాదం మరింత తీవ్రమైంది.

ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 37 మంది అస్వస్థతకు గురికాగా, వారిలో 31 మంది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, మరో నలుగురి పరిస్థితి అత్యంత వి షమంగా ఉందని, వారికి డయాలసిస్ చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కల్లులో అల్ఫ్రాజోలం..

కల్తీకల్లు ఘటనను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి బాధితుల వివరాలను సేకరించింది. కల్లు నమూనాలను పరీక్షించగా, అందులో మత్తు కోసం వాడే ప్రమాదకరమైన ‘అల్ఫ్రాజోలం’ డ్రగ్‌ను కలిపినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఘటనకు కారణమైన హెచ్‌ఎంటీ హిల్స్, సర్దార్ పటేల్ నగర్, హైదర్‌నగర్‌లోని మూడు కల్లు దుకాణాల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు.