calender_icon.png 4 October, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపన్న వర్గాలను కాపాడేందుకే అలైన్మెంట్ మార్పు..

04-10-2025 06:33:51 PM

రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితుల ధర్నాను జయప్రదం చేయాలి..

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

మునుగోడు/గట్టుప్పల్ (విజయక్రాంతి): ప్రభుత్వం ముందు ప్రకటించిన ఒకటి, రెండు అలైన్మెంట్ ప్రకారం కాకుండా మూడో అలైన్మెంట్ రైతులకు తెలపకుండా రూపొందించడం, సంపన్న వర్గాలను కాపాడేందుకే అలైన్మెంట్ మార్చి రైతులకు నష్టం కలిగిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శనివారం గట్టుప్పల మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గట్టుపల, తెరటు పల్లి, నామాపురం, వెల్మకన్నె గ్రామాలలో కొన్ని వందల ఎకరాలు రైతులు పట్టా భూములు కోల్పోతున్నారని, ప్రధానంగా సన్న కారు, చిన్న కారు రైతులే నిర్వాసితులవుతున్నారని ఆయన అన్నారు. దీనిని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రభుత్వం ముందు ప్రకటించిన అలైన్మెంట్ కాకుండా కొత్త అలైన్మెంట్ మార్చడం వల్ల రైతులు సారవంతమైన భూములు, పంటలు పండే భూములు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల వందల కుటుంబాలు భూమిలేని నిరుపేదలుగా మారే అవకాశం ఉందన్నారు. గత బిఆర్ఎస్ హయాంలో జరిగిన అలైన్మెంట్లు గత ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు త్రిబుల్ ఆర్ సమస్యను వాడుకొని అధికారంలోకి రాగానే అలైన్మెంట్ మార్చుతామని హామీ ఇచ్చి ఇచ్చిన హామీని మర్చిపోయారని ఆయన అన్నారు. ఈనెల 6న హెచ్ఎండిఏ కార్యాలముందు జరిగే ధర్నాకు త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని భూ నిర్వాసితులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, కర్నాటి మల్లేశం, మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, కర్ణాటి వెంకటేశం, అచ్చిన శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం, పెద్దగాని నరసింహ, ఖమ్మం రాములమ్మ, విశ్వనాథం ఉన్నారు.