30-01-2026 12:27:53 AM
హయత్‌నగర్ కార్పొరేటర్ నవజీవన్‌రెడ్డి
ఎల్బీనగర్, జనవరి 29 : హయత్ నగర్ డివిజన్ లో జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యంతోనే ట్రంక్ లైన్ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నట్లు కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి ఆరోపించారు. హయత్ నగర్ పాత గ్రామంలోని నేతాజీ యువజన సంఘం వద్ద భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ (1200mm dia) కుంగిపోవడంతో రోడ్డు దెబ్బతిన్నది. సమాచారం తెలు సుకున్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, జలమండలి అధికారులతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ వ్యవస్థను పునరుద్ధరించాలని, ఐదు సంవత్సరాలుగా అనేక మార్లు సంబంధిత అధికారులకు సూచించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. గతంలో ఏర్పాటు చేసిన భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్లకు చాలా సంవత్సరాలు గడిచిపోవడంతో హయత్ నగర్ డివిజన్ పరిధిలో తరచూ డ్రైనేజ్ ట్రంక్ లైన్ కుంగిపోవడం, రోడ్లు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్య క్తం చేశారు.
శాశ్వత పరిష్కారం కోసం పాత ట్రంక్ లైన్లను తొలగించి, కొత్త భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు అవసరమైన నిధు లు వెంటనే మంజూరు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత ఉన్నతాధికారులను కోరారు. ఆయన వెంట జలమండలి అధికారులు సీజీఎం నరేంద్ర కుమార్, డీజీఎం రాజగోపాల్, మేనేజర్ రాజు, సూపర్ వైజర్ బాలు, బీజేపీ నాయకులు ఉన్నారు.