30-01-2026 12:27:32 AM
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, జనవరి 29 (విజయక్రాంతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. మున్సిపల్ ఎన్నికలపై గురువారం జిల్లా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28 నుండి 30 వరకు నామినేషన్ల స్వీకరణ, 31 న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3 న నామినేషన్ల ఉపసంహరణ, ఫిబ్రవరి 11 న ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్, ఫిబ్రవరి 13 న ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే అమలులోకి వచ్చిందని, అందువలన రాజకీయ పార్టీలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూ.చా తప్పకుండా పాటించాలన్నారు.
శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు అయినందున పెద్ద మొత్తంలో నామినేషన్లు వేసే అవకాశాలున్నందున ఆయా పార్టీల వారు వారి తరఫున నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఒక మనిషిని ఏర్పాటు చేసి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లు ఓటు వేసే విషయంలో ప్రభుత్వం తరఫున అవగాహన కల్పిస్తామని, అలాగే రాజకీయ పార్టీలు సైతం అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల వ్యయం ,ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తామని, పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.
జిల్లాలో ఓట్ల లెక్కింపు కు సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి చకీలం రాజేశ్వరరావు, బిజెపి హబీబ్, బీఎస్పీ స్టాలిన్, సిపిఐ ఎం కే .గోపి ,వైఎస్‌ఆర్సిపి రమేష్ ,బి ఆర్ ఎస్ కరుణాకర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సంతోష్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.