calender_icon.png 27 August, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌పై అందరి దృష్టి

27-08-2025 01:23:19 AM

బీహార్ అసెంబ్లీకి రెండు నెలల్లో జరుగనున్న ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఇప్పటికే వివాదాస్పదమైంది. ‘సర్’ తొలి విడత గడువు పూర్తి కావడంతో, మొత్తం 35 లక్షల మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని, లేదంటే జూన్ 24 నుంచి వారి జాడ తెలియలేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నవారు, చనిపోయినవారు, ఓటర్ల గణన పత్రాలు తిరిగి ఇవ్వనివారిది వేరే లెక్క.

మొత్తంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ దుమారం కాంగ్రెస్ కూటమికి కలిసి వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్ల జాబితా తయారీ మొదలు, పోలింగ్ వరకు ఎన్నో అవకతవకలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు బీహార్‌పై దృష్టి పెట్టారు. తన సోదరి, ఎంపీ ప్రియాంక గాంధీతో కలిసి బీహార్‌లో రాహుల్ ‘ఓట్ అధికార్ యాత్ర’ జరుపుతున్నారు. ఓటరు జాబితాలో అవకతవకల్ని తూర్పారబడుతున్న రాహుల్‌కు రాజకీయంగా ఇది కొత్త అవతారమనే చెప్పాలి.

ఇండియా బ్లాక్ మిత్రపక్షాల నాయకులు.. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య వంటివారు కూడా పాల్గొంటున్నా ఎన్నికల ప్రచారానికి సారధిగా రాహుల్ యాత్ర సాగుతోంది. రెండు వారాలుగా రాహుల్ బీహార్‌లోనే మకాం వేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు ఊపు వచ్చింది. రాహుల్ యాత్రలో అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటున్నారు. దారి పొడవునా రాహుల్ ప్రజలతో మమేకమవడం ఇండియా బ్లాక్‌కు కూడా ఉత్సాహానిస్తున్నది. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ బీహార్‌లో సాగిస్తున్న ఓటు యాత్ర ఆయన ఇమేజీని అమాంతం పెంచిందనే చెప్పాలి.

బీహార్‌లో కాంగ్రెస్ ప్రజాదరణ మాత్రం ఇప్పటివరకు నా మమాత్రంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేయగా 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే ఈసారి కాంగ్రెస్‌కు కూటమి తరఫున దక్కే స్థానాలు తక్కువేనని మొదట విశ్లేషకులు అంచనా వేసినా, మారిన పరిస్థితుల్లో ఆర్జేడీ తన వాటాగా సీట్ల సంఖ్యను తగ్గించుకోవాల్సి రావచ్చు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 144 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ 75 స్థానాలు దక్కించుకుంది.

అయితే కాంగ్రెస్ పట్ల బీహారీలకు ఎప్పట్నుంచో విముఖత ఉందని, రాహుల్ యాత్రలతో ఇండియా కూటమికి పెద్దగా ఒరిగేదేమి లేదని జన్ సూరజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిశోర్ జోస్యం చెబుతున్నారు. ‘ఓట్ చోరీ’ అంటూ కాంగ్రెస్ వీధుల్లోకి ఎక్కినా, దానితో సాధించేది శూన్యమేనని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఎన్డీఏ పక్షాలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రధాన పక్షాలైన బీజేపీ, జనతాదళ్ (యూ) చెరో 100 స్థానాల్లో పోటీ పడేలా, చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)కి 20 సీట్లు కేటాయించేందుకు ఒక అవగాహన ఒప్పందం కుదిరినట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అ సెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.