calender_icon.png 27 August, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3౦ నుంచి అసెంబ్లీ

27-08-2025 02:02:01 AM

  1. ఐదురోజుల పాటు జరిగే అవకాశం 
  2. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ
  3. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
  4. సమావేశాలకు కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ 
  5. 30న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): తెలంగాణ సర్కార్ కీలక నిర్ణ యం తీసుకున్నది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నది. ఈ సమావేశాలు మొత్తం ఐదు రోజులు నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నది. ఈ సమావేశాల్లో ఉప సభాపతి ఎన్నికతో పాటు కాళేశ్వరంపై నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు మొదటిరోజు సభలో సం తాపం ప్రకటించనున్నారు.

కాగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి గత శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై అందిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడుతామని, అనంతరం బాధ్యులపై చర్య లు తీసుకుంటామని హైకోర్టు ధర్మసనానికి విన్నవించారు. అయితే పీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టి వేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్.. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఒక వేళ పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.

పూర్తి వివరాలతో మూడు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని, పిటిషనర్లు కోరిన విధంగా స్టే ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. శాసనసభలో చర్చ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

పీసీఘోష్ కమిషన్ నివేదికలోని సలహాలు, సూచనలను ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉందని ఇరుపార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్  హాజరవుతారా? లేదా అనేదానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. 

30న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

అసెంబ్లీ సమావేశాల రోజే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెల 30న మధ్యాహ్నాం ఒంటిగంటకు అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన  జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో క్యాబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అజెండా అంశాలను సాధారణ పరిపాలన విభాగానికి పంపాలని సీఎస్ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాన ఎజెండగా జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వరం కమిషన ఇచ్చిన నివేదికను ఆమోదించనున్నారు. అనంతరం ఆ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజే సభలో ప్రవేశ పెట్టనున్నారు.