calender_icon.png 27 August, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యామ్ రోడ్డు పట్టు..కోట్లు కొల్లగొట్టు!

27-08-2025 02:07:03 AM

హ్యామ్ కాదు.. హ్యామర్!

  1. బడా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే కొత్త విధానం 
  2. తెలంగాణ కాంట్రాక్టర్లు ఖతం! 
  3. రాష్ట్ర ఖజానాకు పెనుభారం

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి) : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనే సామెతకు హ్యామ్ రోడ్లు ఉదాహరణగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఎక్కడ కూడా సరైన రోడ్లు లేవు. దాదాపుగా అన్ని చోట్లా గుంతలు పడిన రోడ్లు, బీటీ ఎగిరిపోయి, సీసీ లేచిపోయి దరిద్రంగా కనిపిస్తున్నాయి. ప్రతి దానికి గత ప్రభుత్వంపై నిందలు మోపే రాష్ట్ర ప్రభుత్వం.. రోడ్ల విషయంలోనూ అద్భుతమైన పరిష్కార మార్గమంటూ హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లను నిర్మిస్తామని ప్రకటించింది.

ప్రతిష్టాత్మకంగా హ్యామ్ విధానంలో 13వేల కి.మీ మేర గ్రామీణ రోడ్లు అభివృద్ధి చేయనుందని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ హ్యామ్ రోడ్లు సర్వరోగ నివారిణి అని సర్కారు చెప్తున్నా.. ఈ విధానం తెచ్చిందే బడా కాంట్రాక్టర్లకు రాష్ట్ర ఖజానాను దోచి పెట్టేందుకు అని రాష్ట్రానికి చెందిన పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన చిన్న కాంట్రాక్టర్లను పూర్తిగా బొందపెట్టి, రాష్ట్ర ఖజానాను బడా కాంట్రాక్టర్లకు మళ్లించే యత్నంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకున్నా హ్యామ్ వల్ల సులభంగా మంచి రోడ్లు వేసేందుకు అవకాశం ఉందని సర్కారు చెప్తున్నదంతా అబద్ధ్దమని..

చేతి నుంచి పైసా పెట్టకుండానే నెలనెలా సర్కారు నుంచి ఈఎంఐ రూపంలో 15 ఏళ్ల పాటు భారీగా దోపిడీ చేసేందుకే ఈ హ్యామ్ విధానాన్ని తీసుకువచ్చారని తెలంగాణ కాంట్రాక్టర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లుగా బిల్లులు చెల్లింపులు చేయరనే భయంతో రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టర్లు ఎవరూ సర్కారు రోడ్ల పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. అందుకే కాంట్రాక్టర్లకు కంపల్సరీ చెల్లింపులు చేస్తూ రోడ్లు బాగు చేసేందుకే హ్యామ్ అని సర్కారు అంటున్నా అసలు ఉద్దేశం మాత్రం నిధులను బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మౌలిక సదుపాయాల కల్పనకే..

ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయలను కల్పించేందుకు హ్యామ్ మోడల్ ప్రవేశపెట్టినట్లు సర్కారు చెబుతున్నది. హ్యామ్ విధానంలో రాష్ర్టం ప్రాజెక్టు వ్యయంలో తన వాటా 40 శాతం నిధులను పది వాయిదాలలో అందిస్తుంది. కాంట్రాక్టర్లు మిగిలిన 60 శాతం నిధులను సమకూరుస్తారు. వీటిని ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేసి 15 ఏళ్లలో యాన్యుటీ చెల్లింపుల ద్వారా ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు తిరిగి చెల్లిస్తుంది. అయితే హ్యామ్ విధానంలో కీలకమైన మతలబు ఏంటంటే.. కాంట్రాక్టర్ ప్రాజెక్ట్ అంచనాలను పెంచేందుకు అవకాశం ఉంది.

పెద్ద కాంట్రాక్టర్లు, ఎన్‌హెచ్‌ఏఐ -గైడెడ్ రేట్ల కంటే 40 శాతం వరకు అంచనాలను పెంచవచ్చని స్థానిక కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఫలితంగా తమ సొంత వాటా పెట్టుబడిని తగ్గించడానికి బిడ్లను రూపొందించి బడా కాంట్రాక్టర్లు అధిక రాబడిని పొందవచ్చు. ప్రభుత్వం ప్రత్యక్ష బ్యాంకు రుణాలపై చెల్లించే 9 శాతం వడ్డీ రేట్లను మించి పెంచిన ఖర్చుల భారాన్ని రాష్ర్టంపైకి నెట్టవచ్చు.

15 ఏళ్ల యాన్యుటీ కాలంలో ఇది వేల కోట్లకు చేరే అదనపు ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చు. ఇది రాష్ట్ర ప్రజలపై తీరని భారంగా మారే ప్రమాదం కనిపిస్తోందని స్థానిక కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ‘కాబూల్‌లోనైనా కాంట్రాక్టు పనులు చేయవచ్చు. అక్కడ తాలిబాన్లు నేరుగా చంపేసే ప్రమాదం ఉంది. కానీ తెలంగాణలో పేమెంట్స్ చేయకుండా, టెండర్ నిబంధనలు మారుస్తూ మమ్మల్ని నిశ్శబ్దంగా చంపుతున్నారు’ అంటూ ఓ కాంట్రాక్టర్ విజయక్రాంతితో వాపోయారు. 

హ్యామ్.. మాయ...

హ్యామ్ మోడల్ కింద రాష్ట్రంలో 13వేల కి.మీ గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచుతుందనిఆర్‌అండ్‌బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారు. అయితే భారీగా అంచనాలు పెంచేసి సంస్థాగత అవినీతితో రాష్ర్ట ఖజానాపై దీర్ఘకాలిక ఆర్థిక భారం మోపేందుకు ఈ విధానం అని రాష్ట్రానికి చెందిన పలువురు కాంట్రాక్టర్లు విజయక్రాంతి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. హ్యామ్ మోడల్‌ను పారదర్శకంగా, ఎన్‌హెచ్‌ఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలపై పెనుభారంగా మారడంతో పాటు రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల వ్యయం పెరుగుతుందని వారు చెబుతున్నారు. 

తొలి దశలో 13,137 కి.మీ హ్యామ్

మొదటి దశలో రూ. 6,478.33 కోట్ల అంచనా వ్యయంతో 5,190 కి.మీ ఆర్‌అండ్‌బీ రోడ్లు, రూ. 6,000 కోట్ల విలువైన 7,947 కి.మీ పంచాయతీరాజ్ రోడ్లు హ్యామ్ విధానంలో నిర్మిస్తామని సర్కారు చెప్తోంది. డిసెంబర్ నాటికి అదనంగా 6,810 కి.మీ. రోడ్లను చేర్చేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రజలకు సురక్షితమైన, గుంతలు లేని ప్రయాణాన్ని అందించేందుకు ఈ రోడ్లను చెప్తూ.. ఎటువంటి టోల్ వసూలు కూడా చేయమంటోంది.

హ్యామ్ పథకం పేపర్‌పై మాత్రమే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ), బిల్డ్, -ఆపరేట్, -ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) రెండింటి మిశ్రమంగా హ్యామ్ ఉంటుందని సర్కారు చెబుతోంది. మరోవైపు రోడ్డు మరమ్మతులకు సంబంధించి పెండింగ్ బిల్లులను కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చినా.. హ్యామ్ విధానంలో తమను సర్వనాశనం చేసేందుకు పెద్ద ప్రయత్నంగా స్థానిక కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

హ్యామ్ వద్దు.. ఈపీసీ ముద్దు 

హ్యామ్ మోడల్ రాష్ట్రానికి పెద్ద ముప్పుగా మారుతుందని భారత బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) తెలంగాణ విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రానికి ఆర్థిక నష్టాలతో పాటు చిన్న కాంట్రాక్టర్లకు దాని వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించాలని బీఏఐ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మోడల్ పెద్ద కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా.. జీవనోపాధి కోసం చిన్న ప్రాజెక్టులపై ఆధారపడే స్థానిక కాంట్రాక్టర్లను నాశనం చేసేలా ఉందని బీఏఐ వాదిస్తున్నది. హ్యామ్ ప్యాకేజీల పరిధిలో ఒక్కొక్కటి 300-400 కి.మీ. స్థాయి రోడ్లను మాత్రమే కవర్ చేయడంతో భారీ కాంట్రాక్టు సంస్థలు మాత్రమే టెండర్లు వేసేందుకు అవకాశం ఉంటుంది.

హ్యామ్ వస్తే పెద్ద కంపెనీలు 120 బ్యాచ్ మిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 50-200 మంది కార్మికులతో పనులు చేయపడతాయని.. చిన్న కాంట్రాక్టర్లు ఆ స్థాయిని అందుకోలేక పూర్తిగా వ్యాపారం నుంచి దూరం జరిగే ప్రమాదం ఉందని బీఏఐ వాదిస్తోంది. హ్యామ్ విధానం కాకుండా ఈపీసీ విధానంలో నియోజకవర్గాల వారీగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని బీఏఐ సూచిస్తోంది. ఇది హ్యామ్ ప్రాజెక్టుల ఖర్చులో 40 శాతం తోనే చక్కని ఫలితాలను అందిస్తుందని చెబుతోంది. ఈపీసీ ద్వారా ప్రభుత్వం నేరుగా ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుంది. బ్యాంకుల నుంచి 9--10 శాతం వడ్డీకి రుణం తీసుకుంటుంది. హ్యామ్ కాంట్రాక్టర్లు డిమాండ్ చేసే అధిక రాబడితో పోలిస్తే కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని బీఏఐ చెబుతోంది. 

రూ. 10వేల కోట్ల దోపిడీకి రంగం సిద్ధం.. 

హ్యామ్ విధానంలో టెండర్ల దశలోనే అవినీతికి అవకాశం ఉందని విమర్శకులు అంటు న్నారు. పెద్ద కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెం డర్ నియమాలను మార్చవచ్చని, వ్యవస్థీకృత పోటీలో చిన్న కాంట్రాక్టర్లను పూర్తిగా నాశనం చే సేందుకు, వారిని పెద్ద కాంట్రాక్టర్ల వద్ద బానిసలుగా చేసే అవకాశం ఉందని ఆరోపణలు వస్తు న్నాయి.  పారదర్శకత లేకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 10వేల  కోట్లకు పైగా దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిన నేపథ్యంలో రూ. 100 కోట్ల ఆర్‌అండ్‌బీ పనులు, రూ. 65 కోట్ల పీఆర్ పనులను చేసేందుకు ఒక్కరంటే ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలే దు. గత బీఆర్‌ఎస్ సర్కారు రూ. 1.75 లక్షల కో ట్ల బిల్లులను చెల్లించని నేపథ్యంలో ప్రభుత్వాన్ని  నమ్మి పనులు చేసేందుకు ధైర్యం సరిపోలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.