27-08-2025 01:56:41 AM
టెక్ మహీంద్రా యూనివర్సిటీ లో డ్రగ్స్ తీసుకున్న విద్యార్థులు
మల్నాడు కేసు దర్యాప్తులో కొత్త కోణం.. నలుగురు అరెస్ట్
కుత్బుల్లాపూర్, ఆగస్టు 26 (విజయక్రాంతి): టెక్ మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థుల్లో కొందరు డ్రగ్స్‌కు అలవాటుపడటం కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లా బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్రా యూనివర్సిటీలో యాంటీ నార్కొటిక్, ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహించి, డ్రగ్స్ పరీక్షలు చేయ గా ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చిం ది. వారిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీ కలుపు, 28 డ్రగ్స్ పాకె ట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మహీంద్రా యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌కు బానిసలవుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం తెలంగాణ యాంటీ నార్కొటిక్ డీసీపీ సైదులు ఆధ్వర్యంలో ఈగల్ టీమ్ అధికారులు దాడులు నిర్వహించారు. యూనివర్సిటీలో 14 మంది విద్యార్థులను పరీక్షించగా వారిలో ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. 50 మంది విద్యార్థులను విచారిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో మణిపూర్‌కు చెందిన నెవీళ్లే టోంగ్ బ్రామ్(21), జీడిమెట్లకు చెందిన అంబటి గణేష్(24), భూస శివ కుమార్(26), ఢిల్లీకి చెందిన మొహమ్మద్ ఆశార్ జావెద్ ఖాన్(21)ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
కాగా మల్నాడు రెస్టారెంట్ కేసు దర్యాప్తులో కొత్తకోణం వెలుగు చూసింది. శ్రీ మారుతి కొరియర్స్ ఫ్రాంచైజీ అయిన రాజేష్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా విద్యార్థులు డ్రగ్ పార్శిల్స్ బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, కర్ణాటక నుంచి డ్రగ్స్ ఆర్డర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. నైజీరియన్ డ్రగ్ సరఫరాదారుడిగా కనిక్ అనే వ్యక్తి మహీంద్రా యూనివర్సిటీలోని భాస్కర్, దినేష్ అనే విద్యార్థులతో సంబంధం పెట్టుకుని ఎండీఎంఏ టాబ్లెట్లు కొనుగోలు చేసి ఇతర విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈగల్ రైడింగ్ లిస్టులో సింబయాసిస్ కాలేజ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గురునానక్ ఇంజినీరింగ్ కాలేజ్, చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ బాసర, జెఎన్‌టీయూ జోగిపేట, ఐసీఎఫ్‌ఏఐ, ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఉన్నట్టు సమాచారం.