29-10-2025 12:33:10 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, అక్టోబర్ 28 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి జిల్లా స్థాయి బాలల పరిరక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇందుకు జిల్లా సంక్షేమ శాఖ సిబ్బందితో పాటు పోలీస్ అధికారులు, విద్యా, వైద్యం, సంక్షేమ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతినెల ప్రతి మండలము గ్రామంలో చైల్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాలు పకడ్బందీగా నిర్వహించాలని అందులో పూజారులను, కుల పెద్దలను, ప్రజలను పిలిపించి బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్థాలను వివరంగా చెప్పాలని, ఒకవేళ బాల్య వివాహాలు చేస్తే కేసు పెట్టీ తీసుకునే తదుపరి చర్యల పై అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 36 బాల్య వివాహాలు జరుగకుండా ఆపి బాధ్యుల పై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు.జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీఎస్పీ వెంకటేశ్వర రావు, పి.డి. డీఆర్డీఓ ఉమా దేవి, డి.సి.పి. ఒ రాంబాబు, జిల్లా అధికారులు, సి.ఐ. లు , సి.డి.పి.ఒ లు, సూపర్వైజర్లు, స్వచ్ఛంద సంస్థ నుండి చిన్నమ్మ థామస్, మహిళా సంఘాల అధ్యక్షులు స్వరూప తదితరులు పాల్గొన్నారు.