calender_icon.png 14 October, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికార్డులన్నీ అక్కడే తయారు..?

14-10-2025 01:07:45 AM

  1. విచారించేది ఎవర్నీ..? 

ఎవరి కోసం ఎంక్వైరీ నోటీసులు? 

నవ్వుతున్న కల్లుగీత సొసైటీ సభ్యులు

మంచిర్యాల, అక్టోబర్ 13 (విజయక్రాంతి ): మంచిర్యాల పట్టణంలోని రిజిస్టర్డ్ ప్రాథమి క కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చేందుకు అక్రమార్కులు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. సంఘం లో అవినీతిపై సభ్యుడు రెండు నెలల కిందట కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ‘విజయక్రాంతి’ దినపత్రికలో ఆగస్టు 6న ‘సంఘం పేరిట గీత దాటుతుండ్రు!’ శీర్షికన కథనం ప్రచురితం చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.

సంఘంలోని అవకతవకలపై వరుస కథనాలు ప్రచురిస్తుంటే వాటిని కప్పిపుచ్చేందుకు అక్రమార్కులు నానా తంటాలు పడుతున్నారు. పదేండ్లుగా ఆడిట్ చేయించని వారు ఉన్నపాటిగా సభ్యులతో పదుల సంఖ్యలో సంతకాలు చేయిస్తూ రికార్డులను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

ఎంక్వైరీ నోటీసులు...

సంఘంలో జరుగుతున్న అక్రమాలపై కోల రాజాగౌడ్ అనే సభ్యుడు కలెక్టర్ దృష్టికి తీసుకుపోగా దానిని ఎక్సైజ్ శాఖకు రెఫర్ చేశారు. అదే వారంలో రాజాగౌడ్ సొసైటీకి వ్యతిరేకం గా పని చేస్తున్నారని, సంఘం నుంచి అతని పేరును తొలగించాలని పొడేటి శ్రీనివాస్, ఇతర సభ్యులు బీసీ డెవలప్ మెంట్ అధికారికి ఫిర్యాదు చేశారు.

మార్క లచ్చాగౌడ్, ఇతర సభ్యులు సైతం రాజాగౌడ్‌పై ఫిర్యాదు చేయగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ కో ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ దేవేందర్ ఈ నెల 15న వీరిని ఎంక్వైరీ అధికారి విచారించనున్నట్లు సమాచారం. ఈ మేరకు వారికి నోటీసులు కూడా పంపించారు. ఈ విచారణ కన్వీనర్‌గా ఉన్న వ్యక్తితో పాటు గౌరవ సభ్యులను కూడా విచారిస్తారా! లేదా కొందరినే విచారిస్తారా తెలియాల్సి ఉంది. 

ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు...

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సభ్యుడు కోల రాజాగౌడ్ మరోసారి కలెక్టర్ కి వినతి చేశారు. సొసైటీ అధ్యక్ష పదవి కాలం ముగిసినందున సొసైటీకి సం బంధించిన రిజిష్టర్, మినిట్స్ బుక్స్, తీర్మానా లు, బైలా, షేర్ క్యాపిటల్ పుస్తకం, క్యాష్ పుస్తకాలు ఆభ్కారి శాఖ అధికారుల వద్దగాని, పర్స న్ ఇంఛార్జీ వద్ద ఉండాలి కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వద్దకు వచ్చాయని, విచారణలో దోషిగా తేలకుండా పాత తేదీల లో అవసరమైన రికార్డులను, పత్రాలను, తీర్మాణాలను తయారు చేస్తున్నారని పేర్కొం టూ కలెక్టర్‌కు విన్నవించాడు.

ఏ ‘లెక్క’న విచారిస్తారు...

సంఘానికి ఆడిటే జరుపడం లేదు, ఇప్పటి వరకు అధికారికంగా ఉన్న సభ్యు లు 39 మంది ఉంటే, అనధికారికంగా ఉన్న సభ్యుల సంఖ్య 144 మంది ఉంది. అధికారులు ఏ లెక్కన లెక్కిస్తారు, నిధులు ఎన్ని వచ్చాయి, ఎంత ఖర్చయ్యాయి ఎలా గుర్తిస్తారు.

విచారణ తేదికి ముందే రికార్డులన్నీ పరిశీలించాల్సిన అధికారులు అసలు రికార్డులన్నీ ఓ పెద్ద మనిషి వద్దే ఉండగా వాటిని ఎప్పుడు పరిశీలిస్తారో సంబంధిత అధికారులకే తెలియాలి. మరో విషయమేమంటే అధికారులు వేసిన త్రీ మెన్ కమిటీలో ఫిర్యాదు చేసిన వ్యక్తి ఉన్నట్లు సమాచారం. కల్లుగీత సొసైటీ సభ్యులు ఈ లెక్కలను, తతంగాన్నంత చూసి నవ్వుతున్నారు.