05-11-2025 02:00:41 AM
గిరిజనుల పట్టాలో గిరిజనేతరులు
వెలుగు చూసినా చర్యలు శూన్యం
భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 4, (విజయక్రాంతి):వడ్డించేవాడు మనవాడు అయి తే.... అన్నట్లు ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రెవెన్యూ కార్యాలయం పనితీరు. గత కొన్ని సంవత్సరాలుగా పాల్వంచ రెవెన్యూ కార్యాలయం రెవెన్యూ అధికారులకు ఆదాయ వనరుగా మారింది అనడం లో సందేహం లేదు. ఏ అధికారి వచ్చిన అడిగినంత పుచ్చుకొని చట్టాలను తుంగలో తొక్కుతున్నట్లు అనేక సంఘటనలు వెలుగు చూస్తున్న జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.
ఆది నుంచి పాల్వంచ రెవెన్యూ అధికారుల తీరు భిన్నం గా కనిపిస్తోంది. ఒక అధికారి ఏజెన్సీ అని, మరో అధికారి నాన్ ఏజెన్సీ అని అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తగదునమ్మానంటూ తర్వాత వచ్చిన అధికారుల సైతం ఆ మార్గంలోనే పయనిస్తున్నారు. ఏకంగా పట్టణ హద్దులను సైతం మార్పు చేస్తున్నారంటే వారికి వారే సాటి.
జిల్లా కలెక్టర్ గా రజత్ కుమార్ షైనీ ప్రభుత్వ భూములను పరిరక్షించాలని తపించి సుమా రు 100 ఎకరాల వరకు రక్షణ కల్పిస్తే, ఆ తర్వాత వచ్చిన జిల్లా స్థాయి నుంచి గ్రామ పాలన అధికారి వరకు రక్షించిన భూములను భక్షించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏర్పాటు చేసిన ఫెన్సింగ్లను సైతం ఆనవాళ్లు లేకుండా చేశారా మహానుభావులు.
ఎస్త్స్రన్మెంట్ పట్టాలో గిరిజనేతరుడు
పాల్వంచ మండల పరిధిలోని రంగాపురం రెవెన్యూ గ్రామంలో గిరిజన రైతుకు ప్రభుత్వం జారీ చేసిన ఎస్త్స్రన్మెంట్ పట్టాలో మండల రెవెన్యూ అధికారి అందిన కాడికి పుచ్చుకొని గిరిజనేతరులను పహానిలో ఎక్కించడం గమనార్హం. అప్పటి రెవెన్యూ అధికారులు 61/2 సర్వే నెంబర్లు 3.07 ఎకరాలను మాలోత్ సామ్య కు ఎస్త్స్రన్మెంట్ పట్టా జారీ చేయడం జరిగింది.
సదరు ఆ పట్టాదారు 2016- 17 వరకు పట్టాదారుగా, అనుభవదారీగా పహానిలో కొనసాగాడు. 2017 - 18 సంవత్సరంలో పనిచేసిన తాసిల్దార్ పి ఓ టి చట్టాన్ని తుంగలో తొక్కి పట్టాదారు కాలంలో మాలోత్ సామ్యా ను పట్టాదారుగా కొనసాగిస్తూ అనుభవదారీ కాలంలో బోధ రాంబాబును నమోదు చేయటం రెవెన్యూ అధికారులకే చెల్లుబాటయింది. ఇంత కాలం ఈ రహస్యం వెలుగు చూడలేదు.
తాజాగా బోధ రాంబాబు అట్టి భూమిలోని ఎకరం భూమి స్థలాన్ని కాపు సంఘానికి విక్రయించడం, ఆ సంఘం నేతలు అట్టే భూమిని శుభ్రం చేసే క్రమంలో శుభ్రం చేసే క్రమంలో విజయక్రాంతి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. అక్రమాన్ని, గిరిజన చట్టాన్ని అతిక్రమించి నట్లు సాక్షాధారాలతో వెలుగు చూపిన అధికారుల్లో చల నం లేకపోగా, గిరిజనేతరులకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలకడం గమ్మత్తుంది పో.
గిరిజన సంఘాలు మౌనమేల...
ఒకవైపు గిరిజన హక్కులను కాలరాస్తున్నారు అంటూ అడపా దడప ఆందోళనలు చేయడం, నిరసనలు చేస్తున్న గిరిజన సంఘాలు గిరిజన చట్టాన్ని తుంగలోకి తొక్కిన రెవెన్యూ శాఖపై ఎందుకు మౌనం వహిస్తున్నాయో భగవంతునికే తెలియాలి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పి ఓ టి వాయులేషన్ అయిన మూడు ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
హక్కులు కల్పించం... పట్టా జారీచేయం
ఓ టి అతిక్రమణ జరిగిన భూమికి గిరిజనేతరులకు పట్టా జారీ చేయమని, ఎలాంటి హక్కులు కల్పించమని తాసిల్దార్ రంగా ప్రసాద్ చెబుతున్నారు. కొనుగోలు చేసిన వారు అట్టి స్థలంలో అభివృద్ధి పనులు చేపడుతుంటే తమకేమీ పట్టనట్టు వ్యవహరించటం పరోక్షం గా గిరిజన చట్టాన్ని తుంగలో తొక్కినట్టేనని స్పష్టం అవుతుంది.
తాసీల్దార్ రంగా ప్రసాద్