04-01-2026 03:47:09 PM
పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఆశావాహులు
ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు(municipal elections) సమయత్తమవుతున్న వేళ అధికారులు మున్సిపల్ ఓటర్ లిస్టులు కార్యాలయాల్లో ప్రదర్శించారు. దీనిపై పలు పార్టీలు, ప్రజాసంఘాలు ఓటర్ లిస్టులో అవకతవకలు ఉన్నాయి అంటూ ఉవ్వెత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీగా మారిన అనంతరం ఇప్పటికీ ఒక పాలకవర్గం సమయం గడచిపోగా రెండవ పాలకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ప్రజల్లో సర్వత్ర చర్చలు జరుగుతున్నాయి.
ప్రధానంగా ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిపై ఎక్కడ ముగ్గురు నలుగురు కూడి ఉన్న చోట తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. కాగా గత మున్సిపాలిటీ పాలకవర్గం సగం కాలం టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన ఉండగా, మరో సగం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగింది దీనిలో సుమారు రెండేళ్లు కోవిడ్ మహమ్మారి సమయంలో కాలం గడిచిపోగా, పట్టణంలో అభివృద్ధి సాగలేదని పలువురు చర్చించుకుంటున్నారు. అనంతరం చైర్మన్ పై అసమ్మతి ,తదుపరి నూతన చైర్మన్ కాల పరిమితి చాలా తక్కువ ఉండడంతో అభివృద్ధిపై దృష్టి సారించలేక ఎక్కడి పనులు అక్కడే ఉన్న చందంగా పట్టణం గందరగోళంలో ఉందని పలువురు మేధావులు చర్చించుకుంటూ ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సమయత్తమవుతుంది.
ఈ నేపథ్యంలో ఒకవైపు పట్టణంలో అభివృద్ధి ప్రధాన రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్, అంతర్గత రోడ్ల అభివృద్ధి ,మురికి కాలువల నిర్మాణం సరిగా చేయలేదంటూ గత పాలక వర్గంపై పలు ఆరోపణలు ఉన్నప్పటికీ ,కంటికి కనిపించే అభివృద్ధి మాత్రం శూన్యమేనని పలువురు చర్చించుకుంటున్నారు. పట్టణంలో ప్రధానంగా కోతుల సమస్య, కుక్కలు, పందులు ,దోమల సమస్య ,విపరీతంగా ఉండడం దీనికి ఎవరు కూడా ముందుకు వచ్చి చర్యలు చేపట్టలేధని ఆరోపణలు. ఇటీవల కాలంలో కోతుల భయంతో పలువురు మరణించిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి .రోడ్డు విస్తరణ జరగక రోడ్డుపై ప్రమాదాలతో పలువురు మరణించారు. ఇవి ఇలా ఉండగా ప్రస్తుతం ఓటర్ లిస్ట్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రిజర్వేషన్, వార్డుల సరిహద్దుల నిర్వహణ కొంతమేర ఇతర కాలనీ వాళ్లను కలపడంతో ,ఆశావాహులు గందరగోళానికి గురవుతున్నారని అంటున్నారు. గతంలో ఉన్న ఓటర్ లిస్ట్ ప్రకారం ఆశావహులు వారి ప్రయత్నాలు ప్రారంభించగా ,ప్రస్తుతం వార్డుల పరిధి పెరగడం ,కొంతమంది ఓట్లు తొలగించడం, అదనపు ఓట్లను కలపడం, సరికాదంటూ పలువురు ఫిర్యాదు చేశారు .ఈ నేపథ్యంలో సోమవారం ఓటర్ లిస్టు పై అభ్యంతరాల సేకరణ కోసం అధికారులు పార్టీల సమావేశం ఏర్పాటు చేయగా పలువురు రాజకీయ మేధావులు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సమయతమవుతున్నారు. వెరసి పట్టణంలో ఎక్కడ చూసినా మున్సిపల్ ఎన్నికల వాడి వేడి చర్చలు కనిపిస్తున్నాయి .కాగా ఓటర్ లిస్టు పై అధికారులు ఏం చెప్తారో వేచి చూడాలి.