14-01-2026 12:50:06 AM
సీజన్ ముగిసే సమయంలో మిల్ ట్యాగింగ్‌లు
సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లులకు కేటాయింపు...
సివిల్ సప్లయ్ అధికారుల లీలలు
మంచిర్యాల, జనవరి 13 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలో పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ అధికారులు ఆడిందే ఆటలా, పాడిందే పాటలా మారుతోంది... మిల్లుల్లో పిజికల్ వెరిఫికేషన్ చేసి ధాన్యం లేదని గుర్తించిన అధికారులు తిరిగి సీఎంఆర్ బకాయిలున్న మిల్లులకు ధాన్యం బ్యాంకు గ్యారంటీల పేరిట ఇవ్వడం, అక్రమార్కులకు తిరిగి పగ్గాలు అందించినట్లే. పాత ధాన్యం లేకున్నా కొత్తగా ధాన్యం ఇవ్వడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్యామ్యాలకు అలవాటు పడిన కొందరి వల్ల ఈ దందా కొనసాగుతుందని, సీఎంఆర్ ధాన్యం దించుకునేందుకు అవకాశం ఇస్తే మిగితా మిల్లర్లకు సైతం ఇవ్వాలి కానీ కొందరికే ఇవ్వడం ఏంటని కొందరు మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లులకు ధాన్యం కేటాయింపు...
సీఎంఆర్ బకాయిలు ఉన్న మిల్లులకు అధికారులు ధాన్యం కేటాయింపులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో ఒక్క ఏసీకే బకాయి ఉన్నా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో సీఎంఆర్ ధాన్యం కేటాయించవద్దని ఉన్నతాధికారుల ఆదేశాలున్నప్పటికి సంబంధిత శాఖ జిల్లా అధికారులు అవేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నా రు. 2024 - 25 ఖరీఫ్ సీజన్ లో రాజరాజేశ్వరీ ట్రేడర్స్, శార్వాణి ఇండస్ట్రీస్ లక్ష్మీపూర్(లక్షెట్టిపేట), లక్ష్మీ నర్సింహా రైస్ మిల్ కాసిపేట (దం డేపల్లి), వర్ణ మోడరన్ రైస్ మిల్ పొన్నారం (మందమర్రి), జయలక్ష్మీ మినీ మోడరన్ రైస్ మిల్లులు సీఎంఆర్ బకాయిలున్నాయి. ఇందు లో లక్ష్మీపూర్ లోని శార్వాణి ఇండస్ట్రీస్ ఆరు ఏసీకే (167 మెట్రిక్ టన్నుల) బియ్యం ప్రభుత్వానికి బకాయి ఉన్నారు. అయినా ఈ ఏడాది సీఎంఆర్ ధాన్యం దించుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతి విషయాన్ని ‘మామూ లు’గా తీసుకునే అధికారులు బకాయి ఉన్న మిల్లర్లకు సైతం ధాన్యం కేటాయించడంపై తోటి మిల్లర్లే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఈ మిల్లుకు సంబంధించిన వ్యక్తి ప్రైవేటుగా ధాన్యం కొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ట్రక్ షీట్లు రాసి పంపిన విషయంలో రైతులకు చాలా రోజుల వరకు ధాన్యం డబ్బు లు పడలేదనేది అధికారులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తెలిసిన విషయమే, అయినా మరోసారి అదే మిల్లుకు సీఎంఆర్ ధాన్యం దించడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి బియ్యం బకాయి ఉంటే బియ్యం పెట్టాలి కానీ దానికి బీజీ (బ్యాంకు గ్యారంటీ)లు తీసుకోవడం ఏంటని, ఎన్ని ఏసీకేల బియ్యం బకాయి ఉంటే అంత మొత్తాన్ని రికవరీ చేసిన తర్వాత ఇక ముందు దింపుకునే ధాన్యానికి బీజీలు తీసుకోవాలి కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బకాయి బియ్యానికి బీజీలిస్తున్నారా? దించుకునే ధాన్యానికి బీజీలిస్తున్నారా? అనేది సివిల్ సప్లయ్ కలెక్టర్ పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సీజన్ ముగిసే సమయంలో మిల్ ట్యాగింగ్‌లు
2025 ఖరీఫ్ సీజన్ ప్రారంభం లో అధికారులు హడావుడి చేసి సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లర్లకు ధాన్యం ఇవ్వమని రుసరుసలాడి, ఆఖరులో అసోసియేషన్ నాయకుల చేతివాటంతో ట్యాగింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సీజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చేదే తక్కువ, ఈ సమయంలో ఆరంభంలోనే పక్క జిల్లాలకు ధాన్యం పంపిన అధికారులు ఆఖరులో మొసలికన్నీరు కార్చుతూ జిల్లాలోని బకాయిలున్న మిల్లులకు ట్యాగింగ్ ఇవ్వడం వెనుక అంతర్యమేమిటో వారికే తెలియాలి. ట్యాగింగ్ ఇవ్వడమే కాకుండా కొనుగోలు కేంద్రాలకు కొందరు అధికారులు ఫోన్ లు చేసి ఫలానా మిల్లుకే పంపించాలి, సన్నాలయితే ఇటు, దొడ్డు ధాన్యం అయితే అటు అంటూ ఆరాట పోరాటాలు చేస్తున్నారంటే వారికి ఎంత మేర ముడుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ప్యాడీ ప్రొక్యూర్ మెంట్ ముగిసే సమయంలో అంటే సుమారు పాతిక రోజుల కిందట సీఎంఆర్ బకాయి ఉండి మిల్లుల్లో ధాన్యం గింజ లేని గోదాంలోలేని మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీస్ ఇందారంతో పాటు శార్వాణి ఇండస్ట్రీస్ లక్ష్మీపూర్, లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్ జైపూర్, లక్ష్మీ శ్రీ రైస్ మిల్, సప్తగిరి ఆగ్రో ఇండస్ట్రీస్ మందమర్రి, శ్రీ క్రిష్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ లకు కేటాయించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మొదటి నుంచి కావాలని అడిగినా ఇవ్వని అధికారులు చివరలో ధాన్యం దించుకోవడానికి అవకాశం ఇవ్వడంలో మతలాబేమిటో, ఇది ఎవరి లబ్ధికోసమో అధికారులకే తెలియాలి.