23-10-2025 12:32:56 AM
-ఆరోగ్య పాఠశాల సమీక్షలో కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యపరమైన అలవాట్లను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఆరోగ్య పాఠశాల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీంసరి పాఠశాల ఉపాధ్యాయుడు నీలం వెంకట్ రచించిన ఇంగ్లీష్ కవితను విద్యార్థులు నేహ, ప్రణవి పఠించారు. విద్యార్థులు ఆరోగ్య పాఠశాల ద్వారా పొందిన ప్రయోజనాలను పాటలు, ప్రజెంటేషన్ రూపంలో వివరించారు.
అలాగే విద్యార్థులకు ప్రశంషా పత్రాలను కలెక్టర్ అందజేశారు. అనంతరం ఆరోగ్య పాఠశాల ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు కలెక్టర్ నగదు పురస్కార ప్రొసీడింగ్ ఉత్తర్వులను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోందని, రక్తహీనత, ఐరన్ మాత్రల ప్రాధాన్యం వంటి అంశాలపై చైతన్యం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు సైతం ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా మరుగుదొడ్లు లేవని 23 పాఠశాలలను గుర్తించామని, వాటి నిర్మాణానికి ఈజీఎస్ నిధుల ద్వారా మంజూరులు చేసినట్లు తెలిపారు. విద్యార్థులలో ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పాఠశాల కోఆర్డినేటర్ అజయ్, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.