23-10-2025 12:28:50 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): దశాబ్ద కాలంగా న్యాయవివాదంలో నలుగుతూ, కబ్జా కోరల్లో చిక్కుకున్న జర్నలిస్టుల స్థలాలకు విముక్తి లభించింది. మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్‌లోని 38 ఎకరాల ప్రభుత్వ భూమిని బుధవారం హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుని రక్షణ కంచె ఏర్పాటు చేశారు. ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో బుధవారం సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు.
కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీ రాబాద్‌లోని సర్వే నంబర్ 25/2లో గల 38 ఎకరాల భూమిని 2008లో రాష్ర్ట ప్రభు త్వం జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసిం గ్ సొసైటీకి కేటాయించింది. ఈ భూమిని జర్నలిస్టులకు పంపిణీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం హెచ్‌ఎండీఏ కస్టడీలో ఉంచింది. అయితే, ఈ కేటాయింపులను వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్లాట్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది.
కోర్టులో కేసు నడుస్తుండటాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు ఈ విలువైన భూమిని ఆక్రమించడం ప్రారంభించారు. ఈ విషయంపై జర్నలిస్టుల సొసైటీ ప్రతినిధులతో పాటు రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు సైతం హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, హెచ్‌ఎండీఏ అధికారులతో కూడిన సంయుక్త బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆక్రమణలు నిజమేనని నిర్ధారించుకుంది.
ఈ క్రమంలో బుధవారం అధికారులు ఆ భూమి వద్దకు చేరుకున్నారు. అప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకుని నివాసం ఉంటున్న వారి ఇళ్లను మినహాయించి, మిగిలిన ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఈ చర్యలను కొందరు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, ప్రభుత్వ భూమిని కాపాడటమే తమ ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు. ఈ సం దర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. “కోర్టు తీర్పు వెలువడిన తర్వాతే ఈ స్థలంలో కేటాయింపులు జరుగుతాయి.
ఈలోగా మరిన్ని ఆక్రమణలు జర గకుండా నివారించేందుకే ఫెన్సింగ్ ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న వారితో త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. హైడ్రా, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని వారి వద్ద ఉన్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు” అని ఆయన స్పష్టం చేశారు.