calender_icon.png 4 July, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపత్కర సమయాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో నిలబడాలి

04-07-2025 12:17:41 AM

- పోలీస్ శాఖ తరఫున ఐదుడీఆర్‌ఎఫ్ బృందాలు 

- రాబోయే భారీ వర్షాల దృష్ట్యా డీఆర్‌ఎఫ్,అగ్నిమాపక శాఖ,6వ బెటాలియన్ టీజీఎస్‌పి అధికారులతో సమన్వయ సమావేశం

- జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

భద్రాద్రి కొత్తగూడెం జులై 3 (  విజయ క్రాంతి); రాబోయే వర్షాల దృష్ట్యా సంభవించే వరదలలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న భాదితులను రక్షించడానికి జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన 5 డీడిఆర్‌ఎఫ్ బృందాలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఎస్పీ రోహిత్ రాజు  అన్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అన్ని శాఖలతో సమన్వయం పాటిస్తూ ముందు కెళ్తున్నామన్నారు.

ఇందులో భాగంగానే గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు, 6th బెటాలియన్ టీజీఎస్పి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణను పొందిన డిడిఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా గోదావరి నది వరదలు సంభవించినప్పుడు నదీ పరివాహక ప్రాంతాలలో నివసించే లోతట్టు ప్రాంత ప్రజలను సంరక్షించడానికి ఈ బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయన్నారు.

రెస్క్యూ సమయంలో అవసరమయ్యే లైవ్ జాకెట్స్,లైఫ్ బాయ్ రింగ్స్,బోట్ పెడల్స్,రోప్స్ మరియు ఇతర సామాగ్రి మొత్తాన్ని ఈ బృందాలకు సమకూర్చడం జరిగిందన్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలో ఎలాంటి విపత్తు ఎదురైనా అక్కడి బాధితులను సంరక్షించేందుకు సమన్వయంతో అన్ని శాఖల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

రాబోయే భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.విపత్కర సమయాల్లో డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలను వినియోగించుకోవాలని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,జిల్లా అగ్నిమాపక శాఖాధికారి క్రాంతి కుమార్,6వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్,ఆపరేషన్స్ ఆర్‌ఐ రవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.