calender_icon.png 17 August, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మవిశ్వాసంతో అద్భుత ఫలితాలు

07-01-2025 12:00:00 AM

మార్చి నెల వచ్చిందంటే దేశంలో పరీక్షల సీజన్ ప్రారంభమయినట్లు భావిస్తారు. విద్యార్థినీ విద్యార్థులు, తల్లితండ్రులు, పాఠశాల యా జమాన్యాలు మార్కులు, ర్యాంకుల వేట లో తమ తమ కృషిని కొనసాగిస్తారు. పరీక్ష అంటేనే ఒక రకమైన ఒత్తిడి పెరుగుతుంది. మంచి ఫలితాలు సాధించాలనే ఆశావహ మానసిక ఒత్తిడి లేదా పాజిటివ్ స్ట్రెస్ ఉన్న యువత పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు.

పరీక్షలకు తయారు అవుతున్న విద్యార్థులు అతిగా ఆలోచిస్తూ, ఏమవుతుందో అనే అనవసర ఆందోళనలు, తీవ్రమైన నెగెటివ్ ఒత్తిడులు పరీక్ష ల్లో ఫలితాలను తారుమారు చేస్తాయని తెలుసు కోవాలి. విద్యార్థులపై తల్లితండ్రు లు, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థుల ప్రభావం కూడా పరీక్షల ఒత్తిడిని పెంచుతుందని గమనించాలి.

పరీక్షల్లో తాహతు కు మించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని లక్ష్యం పెట్టుకున్న యువతలో ‘పరీక్షల ఆందోళన’ తారస్థాయికి చేరి ఫలితాలను మరింత ప్రతికూలంగా ప్రభావితం చేస్తా యి. అయితే  విద్యార్థులు గత పరీక్షల్లో పొందిన మార్కులు లేదా ర్యాంకుల కన్నా కొంతైనా మెరుగైన ఫలితాలను సాధించాలనే ఆచరణయోగ్య లక్ష్యాలను నిర్దేశించు కోవాలి.

మన శక్తి సామర్థ్యాలకు మించి మార్కులు లేదా ర్యాంకులు రావాలని ఆశపడడం వల్ల మన చదువులపై ప్రతికూల ప్రభావాలు పడడంతో పాటు గతం కన్నా తక్కువ స్థాయిలో ఫలితాలు వస్తాయి. 

పరీక్ష ఆందోళనల లక్షణాలు

 పరీక్షలంటే అనవసర ఆందోళనలు మన శారీరక, భావోద్వేగ ప్రతికూలతలకు దారి తీస్తాయి. ముఖ్యంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై అతిగా ఆశలు పెట్టుకోవడం, సహచరుల ఫలితాలను చూసి ఆత్మన్యూనతకు గురి కావడం సా ధారణంగా జరుగుతుంది. ప్రతికూల ఒత్తి డి పెరిగిన యువతలో ఏకాగ్రత సడలడం, ఆందోళనలు పెరిగి ఎక్కువ సమయం చదవకపోవడం జరుగుతుంది.

పరీక్షలంటే భయం పెరిగిన యువతలో శారీరకంగా అతిగా చెమటలు పట్టడం, వాంతులు, జీర్ణ సంబంధ సమస్యలు, గుండె వేగం పెరగడం, శ్వాస మందగించడం, తల నొప్పి, కోపం పెరగడం, అధిక బీపీ, ప్రతికూల ఆలోచనలు వెంటాడడం, భయ దాడి (పానిక్ అటాక్) లాంటి అవలక్షణాలు కనుపి స్తాయి.

భావోద్వేగ ఆందోళన వల్ల అభద్ర తా భావం, తన శక్తి మీద నమ్మకం తగ్గ డం, నిస్సహాయ స్థితి, ప్రతికూల స్వయం భావనలు, అనవసర ఆలోచనలు వెంటాడడం, నిరాశ నిస్పృహలు మేలుకొనడం లాంటి మానసిక ప్రతికూల లక్షణాలు బయట పడతాయి. వీటికి తోడుగా ఏకాగ్రతకు భంగం కలగడం, చంచలత్వం, వాయిదా వేసే ప్రవృత్తి పెరగడం, ఇతర సహచరులతో అనవసరంగా పోల్చుకోవడం, నిద్ర లేమి సమస్యలు ఉత్పన్నం కావడం సాధారణంగా కనిపిస్తుంది. 

ఒత్తిడిని జయించడం ఎలా?

 రాబోయే పరీక్షలకు ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకొని చదవడం ప్రారంభించాలి. పరీక్షా ఫలితాల పట్ల అనవసర ఆలోచనలు మన ఏకాగ్రతను మిం గేస్తాయి. సబ్జెక్టుల వారీగా ప్రణాళికలు రాసుకొని ప్రాధాన్యతాక్రమంలో చదవడం మంచిది. చదివిన పాఠాలు ఎంతవ రకు గుర్తు న్నాయో తెలుసుకోవడానికి స్వయం పరీక్షలు రాయాలి. చదువుతున్న సమయంలో గంట లేదా రెండు గంటలకు ఒకసారి స్వల్ప విరామం తీసుకోవడం, దీర్ఘ శ్వాసలు తీసుకోవడం ఏకాగ్రతను మె రుగు పరుస్తాయి.

గత పరీక్షలో పొందిన మార్కుల కన్నా ఎక్కువ రావాలనే లక్ష్యా లు మంచి ఫలితాలను ఇస్తాయి. నిన్నటి క న్నా నేడు మెరుగైతే మనం ప్రగతి బాటన నడిచినట్లే నని నమ్మాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి.

మనం చదివే చదువుపై అనవసర ప్రతికూల ఆలోచనలకు స్వస్తి పలకాలి. నా శక్తి మేరకు చదువు తున్నాను, మంచి ఫలితాలను సాధించగలను, అనుకున్న ఫలితాలు పొందకపోయి నా రానున్న పరీక్షల్లో మెరుగు పరుచుకోగలను లాంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆశా వహ ఆలోచనలు మన ప్రతిభను పెంచుతాయి. దినచర్యను నిర్ణయించుకొని, మ ధ్య మధ్య పాలు లేదా టీ లాంటివి తాగు తూ మానసిక ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలి.

చదవడాన్ని వాయిదా వేయవ ద్దు. మధ్య మధ్య ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. చదువుతున్న పాఠం లోని ముఖ్య అంశాలను అండర్‌లైన్ చేసుకోవడం మంచిది. డయాగ్రామ్స్, సూత్రా లు, సమీకరణాలు లాంటి అంశాలను చది వే సందర్భంలో రాసుకుంటూ చదవడం మంచిది. ‘ఒక సారి రాస్తే పది సార్లు చదివినటే’్ల నని తెలుసుకోవాలి. కఠినమైన అంశాలంటూ దేన్నీ పక్కన పెట్టడం మం చిది కాదు.

ప్రతి రోజూ కొన్ని నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించండి. అవసరమని భావించినపుడు మీకు ఇష్టమైన టీచర్ లేదా సలహాదారుతో, మిత్రులతో మాట్లాడండి.దానివల్ల మీలో ఒత్తిడి దూరమవుతుంది. 

తీసుకోవలసిన జాగ్రత్తలు

 పరీక్ష రోజున కనీసం 15 -  30 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి చేరే విధం గా ప్రణాళిక వేసుకోవాలి. పరీక్షకు వెళ్లే ముందు అతిగా తినడం మంచిది కాదు. పరీక్షకు ముందు రోజు సమయానికి నిద్ర పోవాలి. సమయానికి చేరలేమేమో అనే ఆందోళనలు మన ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయి. పరీక్ష హాలుకు తీసుకుపోవలసిన హాల్ టికెట్,  ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి.

ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష హాల్లోకి అనుమతించరని గుర్తుంచుకోవాలి. పరీక్ష హాల్లో ఒత్తిడి పెరిగినట్లు అనిపిస్తే ఒకటి రెండు నిమిషాలు కళ్లు మూసుకొని, నిశ్శబ్దం పా టించి తర్వాత మళ్లీ రాయడం మొదలు పెట్టండి. పరీక్షలో సమాధానాలు రాస్తున్నపుడు సమయపాలన పాటించండి. చివరి నిమిషాల్లో ఆందోళనలు పెరిగే పనులు చే యవద్దు. పరీక్షల్లో రాసేటప్పుడు ఇతర స హచరుల వైపు చూడవద్దు.

మార్కులను బట్టి ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటా యించాలో నిర్ణయించుకొండి. కనీసం 10  - 15 నిమిషాల ముందు రాయడం పూర్తి చేసి, ఏం రాసామో, ఎలా రాసామో పేపర్‌ను తిరగేసి పరిశీలించండి.  పరీక్ష పూర్తి అయిన తర్వాత ఎలా రాసామో అంచనా వేయవచ్చుగాని, అతిగా దాని గూర్చి ఆలోచించవద్దు. 

తల్లితండ్రుల పాత్ర

 పరీక్షల పట్ల ఆశావహ ఆలోచనలు మెరుగైన ఫలితాలను అందిస్తాయి. మన ప్రతిభకు ఊతం ఇస్తాయి. శక్తివంచన మేరకు కృషి చేయడం, పరీక్షలను చక్కగా రాయడం, ఫలితాల పట్ల ముందే అతిగా ఆశలు పెట్టుకోవడం మానండి. ఆత్మవిశ్వాసం పెంచే విధంగా మన మీద మనకు నమ్మకం కలిగి ఉండాలి. తల్లితండ్రులు పిల్లలను అనవసర ఆందోళనలకు గురి చేయవద్దు. శక్తికి మించిన భారాన్ని మోపవద్దు. 

ఇతర పిల్లలతో పోల్చడం మానేయండి. ప్రేరణాత్మక వాతావరణం కల్పించండి. మార్కులు అతిగా రావాలని ఇబ్బంది పెట్టకండి. ఉత్తమ పుస్తకాలు, చదివే వాతావరణం, కుటుంబ ప్రశాంతత, ఏకాగ్రత పెంచే సౌకర్యాల కల్పన చేయడం మరువరాదు. మన పిల్లల శక్తిసామర్థ్యాలను తెలుసుకొని వారికి మార్గనిర్దేశనం చేయడండి. అంతేకాకుండా పిల్లలతో పాటుగా తల్లిదండ్రుల్లో ఒవరో ఒకరు మేల్కొని మీకు అండగా మేమున్నామన్న భావన కల్పించండి. 

పరీక్షల సమయంలో మార్కులు, ర్యాంకులు లాంటి వాటి గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. పరీక్షలు అంటే బ్రహ్మ విద్య కాదని, నీ జ్ఞాపక శక్తికి ఒక పరీక్ష మాత్రమేనని తెలియజేయాలి.  పరీక్షలే జీవితం కాదని, జీవితంలో పరీక్షలు ఒక చిన్న భాగమని పిల్లలకు ధైర్యం నూరి పోద్దాం. వారి ఎదుగుదలకు అవసరమైన చేయూతను అందిద్దాం. 

      వ్యాసకర్త సెల్:  9949700037