07-01-2025 12:00:00 AM
భారతదేశంలో మారస్మస్, క్వాషియోర్కోర్, కెరాటోమలాసియా వంటి తీవ్ర పోషకాహార లోపాలు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో సబ్‌క్లినికల్ పోషకాహార లోపం, రక్తహీనత ప్రజారోగ్యానికి ముఖ్యమైన సవాళ్లుగా మారాయి. గణనీయమైన సంఖ్యలో పిల్లలు పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. అనేక రాష్ట్రాల్లో అధిక బరువు, ఊబకాయం ప్రాబల్యం పెరుగుతున్నది.
ఫలితంగా ద్వంద్వభారం ఏర్పడుతున్నది. మన దేశం వ్యాధిభారంలో 56.4% అనారోగ్యకరమైన ఆహారాల వల్ల సంభవిస్తున్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం, క్రమం తప్పక శారీరక శ్రమలో పాల్గొనడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్, హైపర్‌టెన్షన్‌ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని వైద్య నిపుణులు అంటున్నారు. ‘టైప్ డయాబెటిస్’ కేసుల్లో 80% వరకూ నివారించదగ్గవి. ఆరోగ్యకర జీవనశైలితో అకాల మరణాలను గణనీయంగా తగ్గించవచ్చునని చాలామందికి తెలియదు.
‘సమగ్ర జాతీయ పోషకాహార సర్వే 2019’ సమాచారం ప్రకారం, చాలామంది పిల్లలు నాన్-కమ్యూ నికబుల్ వ్యాధులు, మధుమేహం, రక్తపోటు వంటి సంబంధిత ప్రమాద కారకాల ప్రారంభ సంకేతాలను ప్రదర్శిస్తున్నారు.
పోషకాహార లోపం, సాధారణ బరువు ఉన్న పిల్లలు, కౌమారదశలో సగానికిపైగా మార్పు చెందిన జీవక్రియ సంకేతాలను కనుగొన్నారు. ఇది తీవ్ర ప్రజారోగ్య సమస్యలను లేవనెత్తుతున్నది. చక్కెర, కొవ్వు అధికంగా ఉండే, అధిక ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం, విభిన్న పోషక ఆహారాలు పరిమితం కావడం, సూక్ష్మపోషక లోపాలు వంటివన్నీ కలిసి అధిక బరువు/ ఊబకాయం పెరుగుదలకు కారణమవుతున్నాయి.
ఏది ఎంత శాతం?
‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్’ నిపుణులు ‘మై ప్లేట్ ఫర్ ది డే’ పేరున కనీసం 8 ఆహార సమూహాల నుండి మాక్రోన్యూట్రియెంట్లను, సూక్ష్మపోషకాల ను పొందాలని సిఫార్సు చేసింది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, దుంపలు వంటివి రోజువారీ ఆ హారంలో దాదాపు సగభాగం ఉండాలి. మరొక భాగం లో తృణ, చిరు, పప్పు ధాన్యాలు, మాంసాహారాలు, గుడ్లు, గింజలు, నూనె గింజలు, పాలు లేదా పెరుగు ఉంటాయి.
ముఖ్య సిఫార్సులలో తృణధాన్యాలు మొ త్తం శక్తిలో 45%కి పరిమితం కావాలి. పప్పుధాన్యాలు, గుడ్లు మాంసాహారాలు సమిష్టిగా మొత్తం శక్తిలో 14% అందించాలి. కొవ్వుపదార్థాలు 30% కంటే ఎక్కువ ఉండకూడదు. గింజలు, నూనె గింజలు, పాల ఉత్పత్తులు కలిసి మొత్తం శక్తిలో 8% అందించాలి. అయితే, ప్రస్తుత ఆహార విధానాలు ఈ సిఫార్సులకు చాలా దూరంగా ఉన్నాయి.
జనాభాలో గణనీయ భాగం తృణ, పప్పు ధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు వంటి సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తక్కువగా తీసుకుంటున్నారు. శుద్ధి చేసిన తృణధాన్యాలు ఆహారంలో ఒకింత ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అనారోగ్యకరమైన, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరగడంతో అసమతుల్యత మరింత తీవ్రమవుతున్నది.
ఇది విస్తృత పోషకాహార లోపం, దాని సంబంధిత ప్రతికూల ఆరోగ్య దుష్పరిణామాలకు దారితీస్తుంది. అన్ని రకాల ఆహార లోపాల్ని పరిష్కరించడానికి పోషకాలు అధికం చేసుకోవాలి. ఆహారాల లభ్యత, ప్రాప్యత, భరించగలిగే సామర్థ్యాన్ని నిర్ధారించడం అవసరం. వివిధ ఆహార సమూహాలలో విభిన్న వినియోగాన్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. ఆహార మార్గదర్శకాలు కీలకమైన సాధనంగా పనిచేస్తాయి. కనుక, వయోభేదాలకు అతీతంగా ఆహారంలో సమతుల పోషకాల ఎంపికలు తగిన పరిమాణంలో ఉండేలా చూసుకోగలగాలి.
డా. అఖిలమిత్ర ముచ్చుకోట