04-08-2025 12:23:36 AM
వికారాబాద్, ఆగస్టు 3 (విజయ క్రాంతి ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని, ఆయన ఆశయ సాధనకు మనందరం కృషి చేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారంమర్పల్లి మండలం పట్లూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 అడుగుల డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు స్పీకర్ తో పాటు, MLC అద్దంకి దయాకర్, ఉస్మానియా యూనివర్సిటీ ఆరట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఇదే సమయంలో యువత ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం విగ్రహ దాత, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను పట్లూరు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు.
చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి తో కలిసి వికారాబాద్ కు నవోదయ పాఠశాలను మంజూరు చేయించినట్లు, వచ్చే ఏడాది నుండి ప్రారంభం అవుతుందని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు.వికారాబాద్ నియోజకవర్గం మీదుగా వెళ్ళే నాలుగు రాష్ట్ర రహదారులను పదివేల కోట్లతో జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుతెలిపారు.