11-08-2025 01:08:45 AM
- గర్భిణిని భుజాలపై మోసుకెళ్లిన 108 ఈఎంటీ
- దారిలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి
- సంగారెడ్డి జిల్లా మన్యానాయక్ తండాలో దయనీయం
నాగల్‌గిద్ద, ఆగస్టు 10: అడవి బిడ్డలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతునే ఉన్నాయి. సరైన రోడ్డు సౌకర్యాలు లేక గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో నిండు గర్భిణి ఉన్న తండాకు అంబులెన్స్ వెళ్లేందుకు సరైన దారి లేక.. 108 సిబ్బందే ఆమెను భుజాలపై మోసుకొచ్చిన దయనీయ పరిస్థితి. వర్షం పడిందంటే చాలు జిల్లాలోని నాగల్‌గిద్ద మండలంలో ఉన్న అనేక తండాలకు వెళ్లడం కష్టంగా మారుతుంది.
మండలంలోని శాంతినగర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మన్యానాయక్ తండాకు చెందిన కౌశిబాయి ఆదివారం పురిటినొప్పులొచ్చాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఈఎంటీ సంగిశెట్టి ఉదయం 6 గంటలకు అక్కడికి చేరుకున్నా అంబులెన్స్ వెళ్లేందుకు దారి సరిగా లేదు.
దీంతో రెండు కిలోమీటర్ల దూరంలోనే వ్యాన్‌ను ఆపి నడవలేని స్థితిలో ఉన్న మహిళను ఆమె భర్త కొద్ది దూరం ఎత్తుకొని రాగా ఈఎంటీ సంగ్ శెట్టి తన వీపుపై మోసుకొని అంబులెన్స్ వైపు బయల్దేరాడు. కౌశిబాయి మార్గమధ్యలోనే ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రెండు కిలోమీటర్లు నడిచి అంబులెన్స్‌లో కారస్‌గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. పలువురు తండావాసులు ఈఎంటీ సంగిశెట్టి సేవలను కొనియాడారు. దారిలేని తండాకు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సాధించి రోడ్డు వేయాలని తండావాసులు కోరుతున్నారు.