calender_icon.png 2 May, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు అమెరికా పూర్తి మద్దతు

02-05-2025 01:22:31 AM

  1. యూఎస్ రక్షణ శాఖమంత్రితో ఫోన్‌లో సంభాషించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
  2. పహల్గాం ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్‌లో ఉండి ఉంటారని ఎన్‌ఐఏ అనుమానం
  3. దాడి సమయంలో అధునాతన సమాచార వ్యవస్థ ఉపయోగించిన ముష్కరులు!
  4. దాడి జరిగే ముందే నాలుగు చోట్ల రెక్కీ!
  5. బుధవారం కూడా సరిహద్దు వెంబడి కాల్పులు జరిపిన పాక్
  6. సరిహద్దుల్లో పట్టుబడ్డ ఆయుధాలు
  7. అటారి వాఘా సరిహద్దు పూర్తిగా మూసివేత
  8. పహల్గాంలో పర్యటించిన ఎన్‌ఐఏ చీఫ్
  9. బీఎస్‌ఎఫ్ జవాన్ విడుదలపై సందిగ్ధత

న్యూఢిల్లీ, మే 1: అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ గురువారం భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఉగ్రవాదంపై పో రాడుతున్న భారత్‌కు యూఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ‘యూఎస్ రక్షణ శాఖ మంత్రితో మాట్లాడా.

పహల్గాం ఘటనలో 26 మంది అమాయకులు ప్రా ణాలు కోల్పోయిన ఘటనపై ఆయన సంఘీభావం తెలిపారు. పీట్ హెగ్ సెత్ భారత్‌కు మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో యూఎస్ అండగా ఉంటుందన్నారు. ఉగ్రవాదులను పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న తీరు.. వారి శిక్షణ, నిధులు సమకూరుస్తున్న వైనం గురించి పూర్తిగా వివరించా.’ అని రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. 

దాడికి ముందు రెక్కీ!

పహల్గాం ఉగ్రదాడి చేసే ముందు ముష్కరులు కొన్ని రోజుల ముందు నుంచే అక్కడ పాగా వేసి.. నాలుగు చోట్ల రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఉగ్రదాడి అనంతరం అరెస్టు చేసిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్‌లో ఒకరు ఈ విషయం ధ్రువీకరించినట్టు సమాచారం. బైసరన్ వ్యాలీతో పాటు అరు వ్యాలీ, స్థానిక అమ్యూస్‌మెంట్ పార్క్, బేతాబ్ వ్యాలీ తదితర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. తాము బేతాబ్ వ్యాలీలో తీసిన వీడియోలో కూడా ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు రికార్డుందని మహారాష్ట్రకు చెందిన పర్యాటకుడు ఒకరు పేర్కొన్నారు. 

సరిహద్దుల వద్ద ఆగని పాక్ కాల్పులు

సరిహద్దుల వద్ద పాక్ రేంజర్ల కాల్పులకు తెరపడట్లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఏడో రోజు కూడా కా ల్పులకు తెగబడ్డారు. కుప్వారా, ఉరి, అక్నూ ర్ ప్రాంతాల్లో ఎల్‌వోసీ వెంట పాక్ కాల్పులకు దిగింది. పాక్ కాల్పులను భారత ఆర్మీ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. 

బంగ్లా సరిహద్దుల్లో పాక్ ఐఎస్‌ఐ!

బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పాక్ ఐఎస్‌ఐ వర్గాలు ఉన్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ సా రధ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఆ దేశం పాక్‌కు మరింత దగ్గరయింది. 

సరిహద్దుల్లో ఆయుధాలు స్వాధీనం

అమృత్‌సర్ సమీపంలో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. బీఎస్‌ఎఫ్ జవాన్లతో పాటు పంజాబ్ పోలీసులు జరిపిన సంయు క్త ఆపరేషన్‌లో ఆయుధాలు లభించాయి. బీఎస్‌ఎఫ్ ఇంటిలిజెన్స్ వింగ్ సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. 

అటారి సరిహద్దు మూసివేత..

భారత్ మధ్య ఉన్న అటారి సరిహద్దును గురువారం పూర్తిగా మూసేశారు. గురువారం ఒక్కరు కూడా ఈ సరిహద్దు గుండా వెళ్లలేదు. గత వారం రో జులుగా 911 మంది పాకిస్థాన్ పౌరులు దేశాన్ని వదిలివెళ్లారు. 

పహల్గాంలో పర్యటించిన ఎన్‌ఐఏ చీఫ్

ఎన్‌ఐఏ చీఫ్ సదానంద దాటే గురువారం పహల్గాంలో పర్యటించారు. బైసరన్ లోయకు వెళ్లి అక్కడి పరిస్థితులను స్వయం గా పరిశీలించారు.  

పాక్ చెరలోనే బీఎస్‌ఎఫ్ జవాన్

పొరపాటున సరిహద్దు దాటి పాక్ భూ భాగంలోకి అడుగుపెట్టిన 182వ బెటాలియ న్ బీఎస్‌ఎఫ్ జవాన్ సాహూ విడుదల విషయంలో సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ‘మేము ప్రతి రోజు సమావేశమవుతున్నా.. వారు ఏవో సాకులు చెబుతూ సాగ దీస్తు న్నారు.’ అని ఓ బీఎస్‌ఎఫ్ అధికారి మీ డియాకు తెలిపారు. ఆ సైనికుడి రాక కోసం ఆయన కుటుంబం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది.   

ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్‌లో ఉండే అవకాశం

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన నిందితులు దక్షిణ కశ్మీర్‌లో ఉండే అవకాశం ఉం దని ఎన్‌ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. టెర్రరిస్టులు అడవుల్లో ఎక్కువ రోజులు గడిపినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ వెంట ఆహారం, పానీయాలు తీసుకెళ్లారని అధికారులు భావిస్తున్నారు.

ఒక వేళ భద్రతా దళాలు వారిని గుర్తించి కాల్పులు జరిపినా కానీ తిరిగి కాల్పులు జరిపేలా ఇంకా అనేక మంది వీరికి బ్యాకప్‌గా ఉన్నారని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. వీరు మాత్ర మే కాకుండా దక్షిణ కశ్మీర్‌లో ఇంకా అనేక మంది ఉగ్రవాదులు కూడా ఉన్నారని ఎన్‌ఐఏ భావిస్తోంది. దాడి సమయంలో వారు అధునాతన సమాచార వ్యవస్థను ఉపయోగించారని కూడా ఎన్‌ఐఏ వర్గాలు అనుమా నం వ్యక్తం చేశాయి. 

ఐఎస్‌ఐ చీఫ్‌కు కీలక పదవి

పాకిస్థాన్ కుట్రలు, కుతంత్రాలు మరోసారి బట్టబయలయ్యాయి. భారత్ దాడి చేస్తుందని ఓ వైపు భయపడుతూనే మరోవైపు మరిన్ని కుట్రలకు తెరతీస్తోంది. తాజాగా పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఐఎస్‌ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్‌ను నియమించింది. ఆయన పాక్ ఆర్మీలో పని చేసిన అనుభవం ఉంది. ఐఎస్‌ఐ చీఫ్‌గా నియామకం అయ్యే కంటే ముందు పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్‌లో అడ్జుటంట్ జనరల్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 

పాక్‌కు షాక్.. సరిహద్దులో జామర్లు

 పాకిస్థాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (జీఎన్‌ఎస్‌ఎస్) సిగ్నల్‌లకు అంతరాయం కలిగించేందుకు భారత్ తన పశ్చిమ సరిహద్దులో అధునాతన జామింగ్ వ్యవస్థను మోహరించింది. ఈ చర్యతో పాకిస్థాన్ మిలటరీ విమానాల నావిగేషన్ సామర్థ్యం, దాడి సామర్థ్యం గణనీయంగా తగ్గే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

దీనికి ముందు ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు పాక్‌కు చెందిన కమర్షియల్, మిలటరీ విమానాలు సహా అన్నింటికీ భారత్ తన గగనతలాన్ని మూసివేసింది. భారత్ జామింగ్ వ్యవస్థలు అమెరికాకు చెందిన జీపీఎస్, రష్యా యొక్క గ్లోనాస్, చైనాకు చెందిన బైడు వంటి పలు శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థలపై ప్రభావం చూపగలవని సమాచారం. పాకిస్థాన్ మిలటరీ విమానాలు వీటినే వినియోగిస్తున్నాయి. ఇప్పుడివి పనిచేయకపోతే వారి లక్ష్య నిర్ధారణ, దిశా గమనాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశముంది.