18-11-2025 12:00:00 AM
రోహటక్, నవంబర్ 17 : రంజీ ట్రోఫీలో ఈ సారి సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ పలువురు యువ క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. తాజాగా సర్వీసెస్ స్పిన్నర్ అమిత్ శుక్లా సంచలన స్పెల్‌తో రికార్డులకెక్కాడు. హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో 27 పరుగులు ఇచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. తన స్పిన్‌తో హర్యానా బ్యాటర్లకు చుక్కలు చూపించిన అమిత్ శుక్లా 20 ఓవర్లు బౌలింగ్ చేసి 27 రన్స్‌కు 8 వికెట్లు తీసాడు.
దీనిలో 8 మెయిడెన్ ఓవర్లున్నాయి.శుక్లా దెబ్బకు హర్యానా కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. శుక్లా తీసిన 8 వికెట్లలో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్ తొలి ఇన్నింగ్స్‌లో 205 రన్స్‌కు ఆలౌటవగా.. హర్యానా 111 పరుగులకే కుప్పకూలింది. రెండోరోజు ఆటముగిసే సమయానికి హర్యానా 4 వికెట్లకు 122 పరుగులు చేసింది. ప్రస్తుతం హర్యానా 216 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ముంబై భారీ స్కోర్
పుదుచ్ఛేరితో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 630/5 పరుగుల భారీస్కోర్ చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు, నలుగురు హాఫ్ సెంచరీలు చేశారు. సిద్దేశ్ లాడ్(170), ఆకాశ్ ఆనంద్ (107), ముషీర్‌ఖాన్(84),హెర్వాద్కర్ (86), సర్ఫరాజ్ ఖాన్(67), శార్థూల్ ఠాకూర్ (56) రాణించారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పుదుచ్ఛేరి 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది.
శార్థూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్‌లో రాణించి జమ్మూను 170 ఆలౌట్ చేసిన హైదరాబాద్ బ్యాటింగ్‌లో మాత్రం చేతులెత్తేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో జమ్మూ కశ్మీర్ రెండోరోజు ఆటముగిసే సమయానికి 275/4 స్కోర్ చేసింది.