calender_icon.png 26 November, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరగని ముద్ర!

26-11-2025 12:00:00 AM

చిత్ర పరిశ్రమలో తనకు గాడ్‌ఫాదర్ అంటూ ఎవరూ లేకపోయినా నట వారసులే కాదు బయటి నుంచి వచ్చిన వారు కూడా హీరోలుగా రాణించగలరని నిరూపించారు ధర్మేంద్ర. ఆరు దశాబ్ధాల సినీ ప్రయాణంలో అనేక పాత్రలను పోషించి ప్రేక్షకుల మనసులో చెరగని ము ద్ర వేశారు. ఒకవైపు రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ లాంటి దిగ్గజ నటులు.. అమితాబ్, రాజేశ్ ఖన్నా లాంటి సమకాలీన నటుల నుం చి పోటీని తట్టుకొని అగ్రహీరోగా వెలుగొందిన ధర్మేంద్ర జీవితం ఆదర్శప్రాయం.

తనదైన డైలాగ్ డెలివరీ, డూప్ లేకుండా నటించే యాక్షన్ సన్నివేశాలు ధర్మేంద్ర ప్రత్యేకతను చాటి చెప్పాయి. యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ఇలా కథనం ఏదైనా సరే తన నటనతో అద్భుతాలు ప్రదర్శించారు ధర్మేంద్ర. చిన్ననాటి నుంచే సినిమాలపై విపరీతమైన ఆసక్తిని పెం చుకున్న ధర్మేంద్ర.. పదేళ్ల వయసులో భారత స్వాతంత్య్ర పోరాట నేపథ్యం తో 1948లో దిలీప్ కుమార్ హీరోగా నటించిన ‘షహీద్’ చిత్రాన్ని తండ్రికి తెలియకుండా రహస్యంగా చూశారు.

ఆనాడే తాను తెరపై నటుడిగా రాణించాలని ధర్మేంద్ర గట్టిగా నిశ్చయించుకున్నారు.19 ఏళ్లకే ప్రకాశ్ కౌర్‌ను వివాహమాడిన ధర్మేంద్ర సినిమాపై ఉన్న పిచ్చితో సంసార బాధ్యతలు, పిల్లలను విడిచిపెట్టి పంజాబ్ నుంచి బాంబేకు పయనమయ్యాడు. అయితే ధర్మేంద్రను అంత సులువుగా అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. ఈ నేపథ్యంలో 1958లో కొత్త నటీనటుల కోసం ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ ప్రకటన ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో బిమల్ రాయ్, గురుదత్ లాంటి ప్రముఖులు ఉన్నారు.

ఆ సమయంలో మలేర్ కోట్లా అనే పట్టణంలో ఉన్న ధర్మేంద్ర విషయం తెలుసుకొని సైకిల్ తొక్కుకుంటూ ఒక ఫోటో స్టూడియోకు వెళ్లారు. స్టూడియోకు వెళ్లిన ధర్మేంద్ర తనను దిలీప్ కుమార్ లాగా కనిపించేలా ఫోటో తీయాలని ఫోటోగ్రాఫర్‌ను కోరారు. అతను ధర్మేంద్రను అంతకంటే అందంగా ఫోటో తీసి ఇచ్చాడు. అలా బిమల్ రా య్ కంట్లో పడిన ధర్మేంద్ర ‘బందిని’ అనే చిత్రంలో తొలిసారి నటించే అవకాశం దక్కింది.

తనకు అవకాశమొచ్చిన ప్రతీ సినిమాలోనూ నటనతో మెప్పించిన ధర్మేంద్రకు 1966లో వచ్చిన ‘ఫూల్ ఔర్ పత్తర్’ సినిమా తొలి బ్లాక్ బాస్టర్‌ను అందించింది. ఈ సినిమాలో ఒక సీన్‌లో మందు తాగి చొక్కా విప్పి శరీర సౌష్ఠవాన్ని చూపించిన ధర్మేంద్ర అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. ఇదే సినిమా ఆయనకు హీ మ్యాన్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. 1971లో వచ్చిన ‘మేరా గావ్, మేరా దేశ్’తో పాటు ‘యాదోంకి బరాత్’ చిత్రం ధర్మేంద్రను యాక్షన్ హీరోగా నిలబెట్టాయి.

ఆయన ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ 1975 నాటి ఆల్‌టైమ్ బ్లాక్‌బాస్టర్ ‘షోలే’లో వీరుగా అతని నటన భారతీయ చలనచిత్రం లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే ధర్మేంద్ర మద్యపాన ప్రియు డు. సాయంత్రం ఏడు తర్వాత ఆయన చేతిలో మందు గ్లాసు లేకుండా ఊహించలేం. రాత్రిళ్లు ఎంత తాగినా ఉదయం ఐదుకల్లా జిమ్‌లో ఉండ డం ఆయనకు అలవాటు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా జిమ్‌కు వెళ్లే అలవాటును మాత్రం చివరి వరకు కొనసాగించారు. 1980వ దశకంలో బాలీ వుడ్‌ను బెదిరించిన మాఫియా గ్యాంగ్‌లను తన మాటలతోనే భయపెట్టిన ధీరుడు ధర్మేంద్ర. భారతీయ చలనచిత్ర రంగం ఉన్నంతవరకు ధర్మేంద్ర పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.