calender_icon.png 26 November, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగానిదే సర్వాధికారం!

26-11-2025 12:00:00 AM

నేడు భారత రాజ్యాంగ దినోత్సవం :

భారతదేశ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే భారత రాజ్యాంగానికి ముందు, తర్వాత అనేది చారిత్రక సత్యం. ఎందుకంటే భారత రాజ్యాంగం అమలుకు ముందు భారత్‌లో నివసిస్తున్న ప్రజల అందరి మధ్య స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ప్రజాస్వామ్యం, గణతంత్ర భావాలు లేవు. దానికి ప్రధాన కారణం హిందూ వర్ణ వ్యవస్థలో ఉన్న కులం కారణంగా భారతీయ సామాజిక వ్యవస్థ మొత్తం చీలిపోయి ఉన్నది.

10 శాతం ఉన్న అగ్రవర్ణాలు.. 90 శాతం ఉన్న బీసీ,ఎస్సీ, ఎస్టీల మధ్య సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక తారతమ్య భేదాలున్నాయి. దేశంలో 10 శాతమున్న అగ్రవర్ణాలు మాత్రమే విద్యను అభ్యసిస్తూ రాజ్యాన్ని పాలిస్తూ, దేశ సంపాదనను అనుభవిస్తూ 90 శాతం బీసీ,ఎస్సీ, ఎస్టీలను అణచివేస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు 2వేల సంవత్సరాలుగా ఉన్న సామాజిక రుగ్మతలను రూపు మాపడానికి తరతరాలుగా మనుషులుగా కూడా గుర్తింపు లేని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మనిషిగా గుర్తింపు ఇచ్చి సామాజిక గౌరవం, సమాన హక్కులు ఇవ్వడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషి చేశారు.

ఆయన రాసిన భారత రాజ్యాంగం మూలంగానే దేశంలో నివసిస్తున్న మెజార్టీ ప్రజలకు నిజమైన స్వాతంత్ర ఫలాలు అం దాయి. నేటి ఆధునిక సమాజంలో కూడా దేశ పౌరులకు స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియకపోవడానికి స్వాతంత్య్రానంతరం దేశాన్ని పాలిస్తున్న అగ్రవర్ణ పాలకుల అసమర్థత పాలనే ప్రధాన కారణం. కానీ అంబే ద్కర్ రాసిన భారత రాజ్యాంగ అమలు నుంచి దేశంలో నిజమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరివర్తనకు పునాది పడింది.

ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప రాజ్యాంగం భారత్‌కు ఉన్నప్పటికీ అంబేద్కర్ ఆశించిన స్థాయిలో నేడు దేశంలో అభివృద్ధి లేదన్నది నిజం. గణతంత్ర దేశంగా ౭5 సంవత్సరాలు పూర్తునప్పటికీ నేటికీ దేశంలో కోట్ల మంది జనాభాకు నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదు. పౌరులకు సరైన ఉపాధి లభించడం లేదు. 2015లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించింది.

ఈ క్రమంలో 2015 అక్టోబర్‌లో ముంబైలోని అంబేద్కర్ జ్ఞాపిక దగ్గర పునా ది రాయి వేస్తూ మోదీ రాజ్యాంగ దినోత్సవ ప్రకటన చేశారు. అప్పటినుం చి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఏది ఏమైనా పాలకులు రాజ్యాంగ గొప్పతనాన్ని ప్రజలకు తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు వహించినా పాలనలో సర్వాధికారాలు భారత రాజ్యాంగానికి మాత్రమే ఉంటాయన్నది జగమెరిగిన సత్యం.

భారత రాష్ట్రపతి, గవర్నర్లు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, విద్యావంతులు, సామాన్యులు ఎవరైనా సరే.. ‘భారత రాజ్యాంగానికి’ కృతజ్ఞులై ఉండాల్సిన అవసరముంది. అదే రాజ్యాంగానికి మనమిచ్చే నిజమైన గౌరవమని గ్రహించాలి. 

                                పుల్లెంల గణేష్, 9553041549