calender_icon.png 3 July, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌లో అరాచకం

01-07-2025 12:00:00 AM

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనాను పడగొట్టిన తర్వాత, దేశంలో హిందువులపై అరాచకాలు, హిందూ ఆలయాలను ధ్వంసం చేసిన సంఘటనలు పెరిగాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని మురాద్‌నగర్‌లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన స్థానిక నాయకుడు ఫజూర్ అలీ, 21 ఏళ్ల వివాహితను రేప్ చేసినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఐదుగురు నిందితుల్లో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు.

బాధితురాలు హిందూ మతస్థురాలు. భర్త దుబాయ్‌లో కార్మికుడు. తండ్రి గ్రామం లో ‘హరి సేవా’ ఉత్సవంలో పాల్గొనేందుకు పిల్లలతో కలిసి ఆమె వచ్చింది. ఈ నెల 26న రాత్రి స్థానిక బీఎన్‌పీ నాయకుడు అలీ, మరికొందరితో కలిసి వచ్చి బాధితురాలు ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టి అత్యాచారానికి పాల్పడ్డట్టుగా పోలీసులు చెప్పారు. అలీ వెంట వచ్చినవారు బాధితురాలి వీడియో తీసి, దానిని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

ఈ ఘటనపై ఢాకా వీథు ల్లో యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత గురువారం ఢాకాలో అధికారులు, హిందువులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుర్గామాత ఆలయాన్ని తొలగించారు. రైల్వేల స్థలంలో దానిని ఏర్పాటు చేశారని, అందుకే దానిని ఆక్రమణల తొలగింపులో భాగంగా కూల్చివేసినట్టు అధికారులు చెప్పారు.

ముస్లింలు మెజారిటీ గల దేశంలో మైనారిటీలపై ఇలా అకృత్యాలు చెల్లవని హిందువులు దీనిపై తీవ్రంగా నిరసన తెలిపారు. ఢాకాలోని ఖిల్‌ఖెట్ ప్రాంతంలో హిందువుల ఆలయాన్ని తొలగించడం వెనుక తీవ్రవాద శక్తుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తున్నదని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. పదవీచ్యుతురాలైన షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందినప్పటి నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి.

భారత్‌లో సత్సంబంధాలు కలిగి వుండేందుకు ప్రాధాన్యం ఇస్తామని, మొహమ్మద్ యూనుస్ నాయకత్వంలో ఏర్పడిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చేసిన ప్రకటలన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. దేశంలో మైనాటీలపై వరుసగా దాడులు జరుగుతున్నా, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. మత పరమైన మైనారిటీలపై వందల సంఖ్యలో దాడులు జరుగుతున్నా యూనుస్ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తున్నది.

హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందు వుల ఆలయాలే కాదు, హిందూ వ్యాపారస్థులను కూడా టార్గెట్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు నెలల క్రితం హింస చెలరేగింది. ప్రాణభయంతో దాదాపు నాలుగు వేలమంది హిందువులు భారత్ సరిహద్దుకు వచ్చారు. వారిని బంగ్లా బలగాలు బలవంతంగా వెనక్కి పంపించినట్లు ఐక్యరాజ్యసమితి నిజనిర్ధారణ బృందం తన నివేదికలో తెలిపింది.

గత ఏడాది ఆగస్టులో ఒక్క నెలలోనే హిందువులపై దాడులు జరిగిన ఘటనలు దాదాపు 200 నమోదయ్యాయంటే, అక్కడి భీతావహ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. సరిహద్దు ప్రాంతాల్లో హిందూ స్మశాన వాటికలను కూడా ముష్కరులు ధ్వంసం చేసినట్లు ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది.

ఇలాంటి ఘటనలు తన ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు సాగిస్తున్న ప్రచారమని యూనుస్ ప్రకటించినా, జరుగుతున్న ఘటనలు ఆయన ప్రకటనల డొల్లతనాన్ని బయట పెడుతూనే ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో రెండు రోజుల వ్యవధిలోనే మూడు ఆలయాలపై దాడులు జరిగినా బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కంటితుడుపుగానే ఉన్నాయి.