01-07-2025 12:00:00 AM
పులి రాజు :
* ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు వంటివాటితోపాటు దుర్గమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, బీరప్ప, గంగమ్మ ఇతర కులదేవతలు, ‘బొడ్రాయి’ లాంటి పండుగలను కూడా ఊరు ఊరంతా జరుపుకుంటున్నారు. ఈ పండుగలలో మాంసం తినడం గురించి చెప్పనవసరం లేదు. ఆయా సందర్భాలలో మద్యం అయితే ఏరులై పారుతుంది. భోజనం ఖర్చుకంటే మద్యం ఖర్చు కుటుంబాలను అప్పులపాలు చేస్తున్నది.
పండుగలు మన సంస్కృతి, ఆచార, సాంప్రదాయాలకు నిలువుటద్దం. అవి మన జీవన విధానం లో ఒక భాగం. పండుగలు ప్రజలలో ఆనందం, ఉత్సాహంతోపాటు సామాజిక, సాంఘిక, రాజకీయ సంబంధాలను బలోపేతం చేస్తాయి. అదే విధంగా భవిష్యత్ తరాలకు సంస్కృతి, సాంప్రదాయాలను వారసత్వ సంపదను అందిస్తాయి. సామూహికంగా జరుపుకునే పండుగల తో, సామూహిక భోజనాలతో మతాలు, కులాల మధ్యన అంతరాలు తగ్గుతాయి.
కొన్ని మతపరమైనవి, కులపరమైనవి, ప్రాంతాల పరమైనవి, సాంస్కృతిక పరమైనవి, వారసత్వమైనవిగా పండుగలు ఉం టాయి. ఒకప్పుడు పండుగలు ఆనందాన్ని మాత్రమే ఇచ్చేవి. ఇప్పుడు ఇవి అప్పులకు నిలయాలుగా మారినాయి. నేటి తెలంగా ణ సమాజం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంటే గత పది సంవత్సరాల నుంచి ప్రజలు ఎక్కువగా ఖర్చు చేసుకుంటూ, పండుగల కోసం అప్పుల పాలవుతున్నారు.
అంతకంటే ముందు కూడా పండుగలు చేసేవా రు. కానీ ఇంత హంగు, ఆర్భాటాలు, ఖర్చు లు లేకుండా నిరాడంబరంగా జరుపుకునే వారు. సాంస్కృతిక పరమైన పండుగలు బతుకమ్మ, దసరా, దీపావళి, రంజాన్, బక్రీద్, సంక్రాంతి, క్రిస్మస్, ఉగాది వంటివి అయితే ఒకేరోజు అందరూ చేసుకుంటా రు.
కాబట్టి, ఈ పండుగలకు ఖర్చు ఆ కుటుంబం వరకే ఉంటుంది. కనుక, వీటిని చాలా తక్కువ ఖర్చుతో చేసుకుంటారు. ఇదే పద్ధతిలో జాతీయ పండుగలు స్వాతం త్య్ర దినోత్సవం, రిపబ్లిక్ వేడుక లాంటి వాటికి కుటుంబ, వ్యక్తిగత పరమైన వ్యయాలు అసలు ఉండవు. కానీ, మిగిలిన అనేక పండుగలు అలా కాదు.
భూముల ధరలు తెచ్చిన మార్పు
గత పది సంవత్సరాల నుంచి తెలంగా ణ రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల ప్లాట్లతోపాటు గ్రామీణ ప్రాంతాలలోనూ వ్యవ సాయ భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా రాష్ట్ర స్థాయిలో అన్నిచోట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా సాగుతున్నది. ఎక్కువ కుటుంబాలలో డబ్బుల వినిమయం పెరిగింది. దీంతో ప్రతీ పండుగను ఎక్కువగా ఖర్చు పెట్టి చేసుకునే సం ప్రదాయం చాలామందిలో మొదలయ్యిం ది.
తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలలో పుట్టుకలు, పెళ్లిళ్లు, చావులు, గ్రామదేవతలకు బోనాలు వంటివన్నీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇక్కడితో చాలామంది ఆగడం లేదు. ఎన్న డూ లేని రీతిలో ఇప్పుడు బర్త్‌డేలు, మ్యారే జ్ డేలు వంటివాటితోపాటు ఎండాకాలం వచ్చిందంటే దుర్గమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, బీరప్ప, గంగమ్మ ఇతర కులదేవతలు, ‘బొడ్రాయి’ లాంటి పండుగలను కూడా ఊరు ఊరంతా కలిసి చేసుకుంటున్నారు.
ఈ పండుగలలో మాంసం తినడం గురించి చెప్పనవసరం లేదు. ఆయా సందర్భాల లో మద్యం అయితే ఏరులై పారుతుంది. భోజనం ఖర్చుకంటే మద్యం ఖర్చు కుటుంబాలను అప్పులపాలు చేస్తున్నది. ఎంత పెద్ద మొత్తంలో మద్యానికి ఖర్చు పెడితే వారు అంత పెద్దగా పండుగ చేసినట్లుగా, ఆ స్థాయిలో గౌరవం వచ్చినట్లుగా భావించడం పరిపాటి అయింది.
మద్యం ఖర్చు సామాజిక హోదాను సూచిస్తుందని పలువురు భావిస్తున్నారు. ఓడి బియ్యం వండుకుంటే మద్యంతోనే పండుగ ప్రారంభమై, దానితోనే ముగుస్తున్నది. ప్రస్తుతం తెలంగాణలో మద్యం లేని పండుగ లేదం టే అతిశయోక్తి కాదు.
ఊరూర తప్పని తిప్పలు
ఈ క్రమంలో అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. ఊరూర ఏదో ఒక ప్రతీకను తీసుకోవచ్చు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దానంపల్లిలో సుమారు 350 ఇండ్లు ఉంటాయి. గత మే నెలలో బొడ్రా యి పండుగ చేస్తే సుమారుగా ప్రతి ఇంటికీ ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు వచ్చిందని ఆ గ్రామస్తుడు ఒకరు చెప్పారు. ఆ లక్ష రూపాయల అప్పు తీర్చడానికి దాదాపు రెండు, మూడు సంవత్సరాలు పడుతుందని కూడా ఆయనే అన్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేం ద్రంలో ఎల్లమ్మ పండుగ సందర్భం కూడా ఇలాంటిదే.
ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల వరకు ఖర్చు వచ్చిందని తెలుస్తున్నది. గ్రామంలో పదిమందిలోపు ఆర్థికంగా బలపడ్డ కుటుంబాలు పండుగ చేద్దామని ఆలోచించి మొదలు పెడితే ఆ గ్రామస్తులందరికీ అదొక అప్పుల సందర్భంగా మారుతున్నది.
సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో సుమారు 65 కురుమ కుటుంబాలు ఉంటాయి. వారి కులదైవం బీరప్ప. ఈ స్వామి పేరుమీద పండుగ చేస్తే ఒక్కో కుటుంబానికి రూ. 1 లక్ష 50 వేల ఖర్చు వచ్చిందని ఆ గ్రామ యువకుడు ఒకరు అన్నారు. “గత సంవత్సరం నేను పెళ్లి చేసుకున్న సందర్భంలో జరిగిన రుణమే ఇంకా తీరలేదు. మళ్ళీ ఈ పండుగ కోసం లక్షన్నర రూపాయలు అప్పు చేశాను. మొత్తం అప్పు ఎట్లా తీరుస్తానో ఏమో!” అని ఆయ న బాధ పడ్డారు. గిట్లా కారణమేదైనా, అప్పులమీద అప్పులు అయితే వ్యవసాయదారులు ఎట్లా బతికేది?
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం బాగిర్తిపల్లి గ్రామంలో బీరప్ప పండుగకు కూడా అక్కడి ఒక్కొక్క కుటుంబానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చు వచ్చిందని తెలుస్తున్నది. యాసంగి పంట రాళ్లవానతో నష్టం జరిగిన సమయంలోనే ఈ పండుగ జరిగింది. దీంతో ఊరి రైతులకు అప్పుల భారం మరింత ఎక్కువైంది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి ఖల్సా గ్రామంలో ఈ ఎండాకాలంలో పెద్దమ్మ పండుగ, మల్లన్న పండుగ, బీరప్ప పండుగ జరిగిన సందర్భంలోనూ ఒక్కొక్కరికి కనీసం లక్ష రూపాయలపైనే ఖర్చు అయినట్లు ఆ గ్రామస్తులు అన్నారు.
ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా చెబుతూ పోతే ఎన్నో సందర్భాలు. ఆర్థికంగా బలపడిన కొందరి సంతోషం కోసం పండుగల పేర్లతో వారి వారి స్థామతకు మించి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉందా? అంటే సమాధానం రాదు. అప్పు ల బారిన పడి, వాటిని తీర్చే మార్గం లేక నానా అవస్థలు పడుతున్న వారెందరో. ఇంకొందరు ఏకంగా ఆత్మహత్యలకూ తెగిస్తుండటం దారుణం. కొందరి కోసం అందరికి అప్పులు, పండుగల పేర్లతో కొత్త పోకడలు పోతూ స్థోమతకు మించి అప్పులు చేసుకోవడం మంచిది కాదని ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకోగలిగితే బావుంటుంది.