08-07-2025 02:00:08 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 7 (విజయక్రాంతి): కూకట్‌పల్లిలోని అంకురా హాస్పిటల్ వైద్యులు ప్రాణాంతకమైన ఫుల్మినెంట్ వైరల్ మయోకార్డిటిస్ అనే గుండె వాపుతో బాధపడుతున్న 11 నెలల గజర్ల మోక్షిత్ ప్రాణాలు రక్షించారు. జూన్ 2న జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతున్న మోక్షిత్‌ను కూకట్‌పల్లిలోని అంకుర ఆసుపత్రిలో చేర్పించారు.
ఆస్పత్రిలోని సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ తంజిలా ఆధ్వర్యంలో సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ టి సుజిత్, డాక్టర్ నవీద్ ఈ కేసును నిర్వహించారు. చిన్నారికి పరీక్షలు చేయగా శిశువు తీవ్రమైన గుండె వైఫల్యంలో ఉన్నట్లు, పల్స్లెస్ వెంట్రిక్యులర్ టాచీకార్డియాతో ఉన్నట్లు, అనేకసార్లు గుండె ఆగిపోయినట్లు గుర్తించారు.
కార్డియోపల్మోనరీ రిససిటేషన్, డీఫిబ్రిలేషన్, అత్యవసర వెంటిలేషన్ అవసరం అని గుర్తించారు. ఈ కేసుపై పీడియాట్రిక్ కార్డియాలజిస్టులు డాక్టర్ నితిన్ రావు, డాక్టర్ రాజేష్‌తో చర్చించారు. ఆ తర్వాత చిన్నారికి ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అనే లైట్-సేవింగ్ టెక్నాలజీ చికిత్స చేశారు. ఇది కృత్రిమ గుండె, ఊపిరితిత్తులుగా పనిచేస్తుంది.
రోగి శరీరం విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఈ అవయవాలను నయం చేయడానికి వీలు కల్పిస్తుంది అని ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ థామస్ మ్యాట్ కార్డియోథొరాసిక్ సర్జన్ వివరించారు. నాలుగు రోజుల తర్వాత కొవిడ్ పరీక్షలో పాజిటివ్ రావడం, అతని కాళ్ళ సిరల్లో రక్తం గడ్డకట్టడం గమనించారు.
ఈ రెండింటినీ అంకురా ఆసుపత్రిలోని వైద్య బృందం విజయవంతంగా జయించాయి. ప్రాణాలను రక్షించే సహాయక సంరక్షణతో పాటు ఐవీఐజీ, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్, యాంటీఅర్రిథమిక్ మందులు, యాంటీకోగ్యులెంట్లను అందించింది. జాగ్రత్తగా పర్యవేక్షించడంతో, మోక్షిత్ గుండె పనితీరు క్రమంగా మెరుగుపడింది.
మరియు అతన్ని ఈసీఎంవో, మెకానికల్ వెంటిలేషన్ నుంచి తొలగించారు. తుది ఎకోకార్డియోగ్రామ్ 67శాతం ఎజెక్షన్ భిన్నంతో గుండె ఆరోగ్యకరంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత జూన్ 19న చిన్నారిని డిశ్చార్జ్ చేశారు.