02-08-2025 12:00:00 AM
నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి
అదిలాబాద్, ఆగస్టు 1(విజయ క్రాంతి) : తన ఎన్నో రచనలతో సాహిత్య రంగానికి అన్నా భావ్ సాఠే చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, అణగారిన వర్గాలను చైతన్య పరిచిన గొప్ప వ్యక్తి అని పలువురు వక్తలు కొనియాడారు. ప్రముఖ సాహిత్య సామ్రాట్ అన్నా భావ్ సాఠే 105వ జయంతి వేడుక సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆ మహనీయునికి పలువురు ఘనంగా నివాళులర్పించారు.
ఆదిలాబాద్ లో చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని ఆ మహనీయుని విగ్రహానికి బీజేపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నా భావ్ సాఠే జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆ మహానియునికి భారతరత్న అవార్డు అంధించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
సాఠే సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే బొజ్జు
అన్నా భావ్ సాఠే సేవలు చిరస్మరణీయమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలో అన్నా భావ్ సాఠే జయంతి వేడుకల్లో బొజ్జు పటేల్ పాల్గొన్నారు. .
ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన సాఠే పుస్తకాలు : మాజీమంత్రి
అన్నా భావ్ సాఠే రచించిన పుస్తకాలు ప్రపంచానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. సాఠే జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్‌లోని ఆ మహనీయుని విగ్రహానికి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్నాభావు సాఠే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపు ను ఆయన ప్రారంభించి, రక్తదానం చేసిన పలువురిని మాజీ మంత్రి అభినందించారు.