12-07-2025 06:40:08 PM
హైదరాబాద్: షామీర్‌పేటలోని ప్రతిష్టాత్మక నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 22వ స్నాతకోత్సవం శనివారం జరిగింది. ఈ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, చాన్సెలర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (తాత్కాలిక) జస్టిస్ సుజయ్ పాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ విద్యార్థులను ఉద్దేశించి దిశానిర్దేశం చేయగా, ఈ స్నాతకోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు మాజీ న్యాయమూర్తులు, న్యాయ కోవిధులు, యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ శ్రీకృష్ణ దేవ రావుతో పాటు న్యాయవాదులు హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవంలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు న్యాయమూర్తులతో కలిసి ముఖ్యమంత్రి గోల్డ్ మెడల్స్ బహూకరించారు. జస్టిస్ సుజయ్ పాల్ డాక్టరేట్ సాధించిన వారితో పాటు ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీఏ ఎల్ఎల్‌బీ (హానర్స్) పీజీ డిప్లమా పొందిన విద్యార్థినీ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. చట్ట సంబంధమైన వివిధ అంశాలపై నిపుణులు రాసిన పలు పుస్తకాలను ఈ వేదికగా ఆవిష్కరించారు.