calender_icon.png 13 July, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యశ్రీ స్కీం.. అక్రమార్కుల స్కాం?

13-07-2025 12:00:00 AM

- సూత్రధారి అవుట్ సోర్సింగ్ ఉద్యోగే!

- రూ. 10 లక్షలపైనే స్వాహా ఆరోపణలు

- నిధుల దుర్వినియోగంపై నీలినీడలు

- కమిటీ పేరిట కాలయాపన 

- ఆరు నెలలైనా నివేదిక ఇవ్వలే 

- అధికారుల తీరుపై అలుముకున్న అనుమానాలు

- సూర్యాపేట జనరల్ ఆసుపత్రిపై ప్రత్యేక కథనం 

సూర్యాపేట, జూలై 12 (విజయక్రాంతి): అనారోగ్య సమస్యలతో బాధపడే నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది.ప్రైవేటు దవాఖానలతో పాటు ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలోనూ అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకంలో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పథకం కింద అందుతున్న వైద్య సేవలు ఏమోగాని అక్కడ జరుగుతున్న అక్రమాలు అధికారులు జేబుల నింపుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

స్కీం అక్కడే.. స్కాం అక్కడే.? 

సూర్యాపేట జనరల్ దవాఖానలో డిసెంబర్ 2007న ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్య సేవలను ప్రారంభించారు. ప్రారంభంలో బాగానే ఉన్నా.. రానురాను కొందరు అక్రమార్కులకు అది మంచి ఆదాయ వనరుగా మారింది.  అనారోగ్యంతో బాధపడే వారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రాగానే అసలు కథ మొదలవుతుంది. దవాఖానకు రాగానే కొందరు రోగులను ఇన్‌పేషంట్‌గా జాయిన్ చేసుకుంటారు. అనంతరం రోగుల నుంచి ఆధార్ కార్డు, రేషన్‌కార్డులను వైద్య సిబ్బంది తీసుకుంటారు. తదుపరి వారికి ఏ వివరాలు చెప్పకుండానే ఆరోగ్యమిత్రల వద్ద రిజిస్ట్రేషన్ చేయిస్తారు. అనంతరం సాధారణ రోగిలాగానే వారికి కూడా వైద్య సేవలు అందిస్తారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఇన్‌పేషెంట్‌గా జాయిన్ అయిన వారికి ప్రత్యేక వైద్యసేవలు, భోజనం, రవాణా, వసతి సౌకర్యాలు కల్పించాలి. కానీ అవేమీ లేకుండా అందరిలాగే సాధారణ సేవలు అందజేస్తున్నారు. ఇక్కడే అసలు స్కాం కథ అలా మొదలవుతుంది. ఇంత జరుగుతున్నా ఆరోగ్యశ్రీ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 

ఆరు నెలలు క్రితమే..  ఆరు నెలల క్రితం దవాఖానాలో ఆరోగ్యశ్రీ పేరిట అక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం వెలుగులోకి వచ్చింది.

అందులో పనిచేస్తున్న సిబ్బంది మధ్య పంపకాల విషయంలో తేడాలు రావడంతో ఈ సమాచారం బయటకు పొక్కింది. ఈ విషయంపై మీడియాలో వార్తలు రావడంతో జిల్లా అధికారులు స్పందించారు. నిధుల దుర్వినియోగంపై గత ఫిబ్రవరిలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు నివేదికను అప్పగించలేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఇంతకాలం కమిటీ సభ్యులు నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేసినా అసలు ఎటువంటి చర్యలు లేకపోవడంతో అధికారుల తీరుపైనా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా అసలు విషయాలు బయటకు రాకుండా అధికారులే  సహకరిస్తున్నారనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి.

  ఇప్పటికీ అదేతంతు

ఇంతజరిగినా ఇప్పటికీ పేషెంట్లకు తెలియకుండానే ఆరోగ్యశ్రీ పథకం కింద రోజుకు పదికి పైనే రిజిస్ట్రేషన్లు చేసి దవాఖానలో చేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది. వారికి జరుగుతున్న వైద్యసేవలు సాధారణమే. దవాఖానలో గోడలపై ఆసుపత్రికి వచ్చేటప్పుడు ఆధార్‌తో పాటు ఆహార భత్రద కార్డును తప్పనిసరి తీసుకరావాలనే సూచిక బోర్డును మెడికల్ సూపరింటెండెంట్ పేరున ఏర్పాటు చేయడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైంది. ఇదిలా ఉండగా ఆరోగ్యశ్రీ కింద దవాఖానలో జాయిన్ అయ్యి తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు ఆరోగ్యశ్రీ డిశ్చార్జ్ సమ్మరీ ఇవ్వకుండా పంపిస్తున్నట్లు పలువురు బాధితుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కమిటీ నివేదిక జాప్యం జరగడానికి కారణాలు తెలుసుకుని అసలు విషయాలను రాబట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రూ.10 లక్షల పైనే స్వాహా 

ఆరు నెలల క్రితం ఇదే దవాఖానకు ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రోత్సాహంగా వచ్చిన రూ.10 లక్షలకు పైగా నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణ వచ్చాయి. సుమారు తొమ్మిదేళ్లకు పైగా ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, అతనికి సహకరిస్తున్న మరో అధికారి ద్వారానే ఈ నిధులు పక్కదారి పట్టాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పథకానికి సంబంధించిన అన్ని అంశాలు అతని ద్వారానే జరుగుతుండడంతో దీనిపై అతను   పట్టు సాధించినట్లు తెలుస్తుంది. అలాగే ఇతనికి ఓ మహిళా అధికారి సహకారం లభించడంతో ఈ తంతు కొన్నాళ్లుగా సజావుగా సాగుతుందనే వార్తలు వినవస్తున్నాయి. ఈ క్రమంలోనే తనకు నచ్చిన వ్యక్తులకు, అనుకూలంగా ఉండేవారికి, అసలు శస్త్రచికిత్సలతో సంబంధం లేని వారికి డబ్బులు ఖాతాలలో వేయించాడనే ఆరోపణ బలంగానే వినిపించాయి.  

 స్కాం జరుగుతుంది ఇలా

సాధారణంగా ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స జరిగితే ప్రభుత్వం ఇచ్చే నగదులో 40 శాతం దవాఖాన అభివృద్ధికి, మిగిలిన 60 శాతం శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యసిబ్బందికి ప్రోత్సాహకంగా అందిస్తారు. 60 శాతంలో కూడా 35 శాతం డాక్టర్లకు, స్టాఫ్ నర్స్‌కు 10, పారామెడికల్ సిబ్బందికి 10, నాలుగో తరగతి ఉద్యోగులకు 5 శాతం చొప్పున బిల్లులను ప్రభుత్వం అందిస్తుంది. అయితే దీనిని అడ్డు పెట్టుకుని ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగులతో ఆరోగ్యశ్రీ పథకానికి దరఖాస్తు చేయిస్తున్నారు. ఇలా వచ్చిన ప్రోత్సాహకాలను కొందరు అక్రమార్కులు  శస్త్రచికిత్సలో పాల్గొనకున్నా దవాఖానలో తమకు అనుకూలంగా ఉన్న వారికి, ఆసుపత్రితో సంబంధంలేని తమ బంధుగణానికి బ్యాంక్ ఖాతాలలో జమ చేసినట్లు తెలుస్తుంది.