13-07-2025 12:06:38 AM
భువనేశ్వర్, జూలై 12: ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఒక అధ్యాపకుడి లైంగిక వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో తీవవ్ర మనస్తాపానికి గురయ్యింది. న్యాయం జరగడం లేదనే ఆవేదనతో కాలేజీ ప్రాంగణంలోనే సదరు విద్యార్థిని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది.
90 శాతం కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమెను కాపాడేందుకు యత్నించిన తోటి విద్యార్థి సైతం తీవ్రంగా గాయపడ్డాడు. బాలేశ్వర్‌లోని ఫకీర్ మోహన్ కాలేజీలో బాధితురాలు ఇంటిగ్రేటెడ్ బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. హెచ్‌వోడీగా పనిచేస్తున్న అధ్యాపకుడు విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడు. తన మాట వినకుంటే భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరించసాగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.