calender_icon.png 19 November, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధనుష్ శ్రీకాంత్‌కు మరో స్వర్ణం

19-11-2025 12:12:28 AM

-మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో మెడల్ 

-డెఫ్లంఫిక్స్‌లో యువషూటర్ వరల్డ్ రికార్డ్

టోక్యో, నవంబర్ 18 : తెలంగాణ యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ డెఫ్లంఫిక్స్‌లో అదరగొడుతున్నాడు. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన ధనుష్ తాజాగా ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లోనూ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. రెండు రోజుల్లో అతనికిది రెండో స్వర్ణం.ఫైనల్స్‌లో ధనుష్ శ్రీకాంత్‌మహిత్ సంధు జోడీ ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. షూటింగ్‌లో తిరుగులేని ఆధిపత్యం కనబరిచే కొరియా జోడీపై భారత ద్వయం అదరగొట్టింది.

ఫైనల్లో 17 స్కోర్ తేడాతో కొరియా జంటకు షాకిచ్చి అగ్రస్థానంలో నిలిచింది. కాగా మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో కాంస్యం కూడా భారత్‌కే దక్కింది. భారత్‌కు చెందిన ముర్తాజా వానియా జోడీ 16 స్కోర్‌తో ఉక్రెయిన్‌కు చెందిన లికోవా జోడీపై విజయం సాధించింది. ఈ పోటీల్లో భారత్ షూటర్లు ఇప్పటి వరకూ 9 పతకాలు గెలుచుకున్నారు. మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో అనుయ ప్రసాద్‌కు స్వర్ణం, ప్రాంజలి ధుమాల్‌కు రజతం దక్కాయి.

అలాగే పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో అభినవ్ దేశ్వాల్ రజతం సాధించారు. బుధవారం ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో పోటీలు ప్రారంభం కానుండగా మరిన్ని మెడల్స్ వచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే డఫ్లంఫిక్స్‌లో వరుసగా రెండో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు.

మరోవైపు గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో నేహ చౌహాన్ శిక్షణలో రాటుదేలిన ధనుష్ శ్రీకాంత్‌ను అకాడమీ ఫౌండర్, ఒలింపిక్ మెడలిస్ట్ గగన్ నారంగ్ ప్రశంసించారు.తన కుమారుడి కఠోర శ్రమకు  ఈ రెండు స్వర్ణాలతో గుర్తింపు లభించిందని ధనుష్ తల్లి ఆశా శ్రీకాంత్ చెప్పారు.