24-05-2025 11:07:43 PM
జిల్లాలో బయోచార్‌తో ముందుకు వెళ్లాలని ఆకాంక్ష..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తక్కువ ఆక్సిజన్ (గాలి) తో ఎండిపోయిన మొక్కలు, పనికిరాని చెట్ల కొమ్మలను కాల్చడం ద్వారా ఏర్పడే శాశ్వత కార్బన్ నిల్వతో కూడిన బొగ్గే బయోచార్" అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్(Collector Jitesh V. Patil) తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా బయోచార్ తయారీకి కలెక్టర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ దిశగా ఆయన కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం పక్కనే స్వయంగా మొట్టమొదటి ప్రయోగాత్మక ప్రదర్శనను నిర్వహించారు. ముందుగా ఒక ఖాళీ డ్రమ్ తీసుకొని దాని కింద భాగంలో గాలి ప్రవేశించేలా రంధ్రాలు చేశారు. ఆ డ్రమ్‌ను మూడు సిమెంట్ రింగుల మధ్య ఉంచి, అడుగులో ఎండిన ఆకులు వేసి మంట వెలిగించారు.
పైభాగంలో ఎండిపోయిన, పనికిరాని మొక్కల భాగాలను వేసి, డ్రమ్‌కి మూత పెట్టారు. రింగుల మధ్యలోనూ ఆకులు, పొట్లులు వేసి మంట పెట్టడంతో లోపల ఏర్పడే పొగ తక్కువగా ఉంటుంది. తక్కువ ఆక్సిజన్‌లో కాలిన మొక్కలు బూడిదగా మారకముందే వాటిని నీటితో చల్లార్చితే, ఏర్పడిన బొగ్గును బయోచార్ అంటారని కలెక్టర్ స్వయంగా ప్రదర్శించారు. దీనిని పొడి లాగా చేసి పంటపొలాల్లో వాడితే మంచి ఫలితాలు ఇస్తాయని పేర్కొన్నారు, దీనికి పశు మూత్రం జోడించి ఉపయోగిస్తే మరింత ఫలితం ఉంటుందని తెలిపారు.
బయోచార్ అంటే ఏమిటి? కలెక్టర్ మాటల్లో...
బయోచార్ అనేది పంట మిగులు, ఎండిపోయిన మొక్కలు, చెట్ల కొమ్మలు వంటి జీవ పదార్థాలను తక్కువ ఆక్సిజన్ ఉన్న పరిస్థితుల్లో కాల్చి తయారుచేసే ప్రకృతి మిత్ర పదార్థం. ఇది శాశ్వతంగా కార్బన్ నిల్వ చేస్తూ, నేల ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలు కలిగి ఉంటుందన్నారు.