calender_icon.png 19 September, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమ్యామ్యాలిస్తే ఏదైనా సాధ్యమే..?

19-09-2025 12:00:00 AM

  1. ఏజీఎల్ ట్రాన్స్ ఫార్మర్‌కి కమర్షియల్ విద్యుత్ కనెక్షన్
  2. విద్యుత్ అధికారుల లీలలు

మంచిర్యాల, సెప్టెంబర్ 18 (విజయక్రాం తి): జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులతో ప్రజలు, రైతులు, లబ్ధిదారులు ఇబ్బందుల ను ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని కోటపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఎక్కడ చూసిన దాబాలే దర్శనమిస్తుంటాయి. మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత నదీ తీరం నుంచి దాదాపు పది డాబాల వరకు రహదారికి ఇరువైపులా నడుస్తున్నాయి.

ఇంత వరకు బాగానే ఉన్న ఆ దాబాలకు విద్యుత్ ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో అర్థం కావడం లేదు. గ్రామాలకు దూరంగా ఉండే ఈ దాబాలకు కమర్షియల్ విద్యుత్ ఎలా సరఫరా చేశారు.., చేస్తున్నారో ఆ అధికారులకే తెలియాలి. దాబాల సమీపంలో గ్రామాలు లేకపోవడం, చుట్టూ వ్యవసాయ పొలాలే ఉండటంతో వాటికి విద్యుత్ అధికారులు సరికొత్త ఆలోచన చేసినట్టున్నారు.

వ్యవసా య ట్రాన్స్ ఫార్మర్‌ల నుంచి సాధారణంగా వ్యవసాయ బోరుబావులకు విద్యుత్ సరఫ రా చేస్తుంటారు. కానీ ఇక్కడి అధికారులే తీరేవేరు... వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ నుంచి దాబాలకు విద్యుత్ ను అందించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అది కూ డా సుమారు 150 మీటర్ల దూరం నుంచి, జాతీయ రహదారి అవతలి ఉన్న ట్రాన్స్ ఫార్మర్ నుంచి విద్యుత్ అందిస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్ కి నేరుగా వైర్లు కలిపి నీరు ప్రవహించే బ్రిడ్జి కింద నుంచి విద్యుత్ వైర్లు గుంజి దాబాకు విద్యుత్ ఇవ్వడం వెనుక అంతర్యమేమిటో ‘మామూలు’గా తీసుకునే అధికారులకే తెలియాలి. 

లైన్‌మెన్ ఇష్టారాజ్యం..

కోటపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ అధికారుల తీరే వేరు... దేవులవాడ సబ్ స్టేషన్ నుంచి పలు గ్రామాలకు, వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా అవుతుంది. అక్కడి లైన్‌మెన్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కుమ్మక్కై దాబాలకు ఇష్టారాజ్యంగా అగ్రికల్చర్  ట్రాన్స్ ఫార్మర్‌ల నుంచి విద్యుత్ అందజేస్తున్నారు.

అది కూడా డబ్బులిచ్చిన వారికే పవర్ సరఫరా చేస్తూ ఇయ్యని వారి విద్యుత్ కేబుళ్లు కట్ చేసి తీసుకువెళ్లడం అక్కడ ఆనవాయితీ. ఆమ్యామ్యాలిస్తే ఏదైనా నేనే చూసుకుంటానని, ఏఈ నుంచి మొదలుకుంటే ఎస్‌ఈ వరకు అంతా నా బాధ్యతేనని,

లేకుంటే విజిలెన్స్ అధికారులు వచ్చి కేసులు నమోదు చేస్తారని బెదిరించడం, డబ్బులివ్వకుంటే పట్టించడం అక్కడ లైన్ మెన్‌కు పరిపాటిగా మారింది. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందని, ఈ విషయంలో పలుమార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.