06-01-2026 12:06:07 AM
ఆలయ ఈవో శ్రీనివాసరావు
నాగర్ కర్నూల్, జనవరి 5 (విజయక్రాంతి): శ్రీశైల దేవస్థానంలో స్వచ్ఛంద సేవలు అందించే శివసేవకుల కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శ్రీశైల ఆలయం ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం స్వచ్ఛంద సేవలందించే శివసేవకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
శివరాత్రి మహోత్సవ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి అత్యధిక శాతం భక్తులు శ్రీశైల క్షేత్రానికి రానున్నారని వారిని అతిథులుగా భావించి సకల సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో శివ సేవకులతో భద్రత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా బృందాలుగా లేదా వ్యక్తిగతంగా ఆన్లైన్ నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
సేవా సమయంలో శివసేవకులకు తాత్కాలిక గుర్తింపు కార్డులు, దేవస్థానం లోగోతో కూడిన స్కార్ఫ్ అందజేస్తామని తెలిపారు. క్యూకాంప్లెక్స్లు, ఆలయ ప్రాంగణం, అన్నప్రసాద విభాగం, కల్యాణకట్ట తదితర ప్రాంతాల్లో అంకితభావంతో, మర్యాదపూర్వకంగా భక్తులకు సేవలందించాలని సూచించారు. ఈ సమావేశంలో శివసేవకుల విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి కె. వెంకటేశ్వరరావు, పర్యవేక్షకురాలు టి. హిమబిందు తదితరులు పాల్గొన్నారు.