20-05-2025 12:13:10 AM
సిద్దిపేట, మే 19 (విజయ క్రాంతి): విద్యుత్ శాఖలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరును విజయక్రాంతి ప్రచురిస్తున్న క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో గల విద్యుత్ శాఖ స్టోర్‌లో బినామీలు రాజ్యమేలుతున్నారు. గడిచిన మూడేళ్లుగా ఆయా వర్క్ ఆర్డర్లు ఒకే వ్యక్తికి చెందిన మూడు ఫర్మ్ లకు ఇవ్వడం ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తుంది.
ఇలా ఒకే వ్యక్తికి చెందిన ఫర్మ్‌లకు ఎల్పీఓలు ఇవ్వడంలో జిల్లా ఉన్నతాధికారితో పాటు స్టోర్ ఉన్నతాధికారి పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల విజయక్రాంతిలో ప్రచురితమైన వార్తల నేపథ్యంలో స్టోర్‌లో కొంత అలజడి చెలరేగినప్పటికి పనులను ఇవ్వడంలో మాత్రం అధికారులు జంకడం లేదని తెలుస్తోంది.
వారికి ఉద్యోగం చోటనే వ్యాపారం చేసే అవకాశం లభించడంతో బినామీ కాంట్రాక్టర్లతో కుమ్మకై మూడు పువ్వులు ఆరుకాయలుగా వెనకేసుకుంటున్న అధికారి తీరు ఆ శాఖకే మచ్చ తెస్తుంది. ఈ తతంగమంతా తెలిసిన శాఖ ఉన్న తాధికారులు బినామీ కాంట్రాక్టర్లకు వత్తాసు పలకడం పట్ల ఆంతర్యం ఏంటని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
ఒకే ఫర్మ్‌కు వర్క్ ఆర్డర్లు&
సిద్దిపేట విద్యుత్ శాఖకు చెందిన స్టోర్ లో ఉన్నతాధికారి బినామీ ఫర్మ్ లకు సగా నికి పైగా నిబంధనలకు విరుద్ధంగా ఆర్డర్లు (ఎల్పీఓలు) ఇస్తున్నారు. ఒకే వ్యక్తి కుటుంబ సభ్యులకు చెందిన మూడు ఫర్మ్ లకు దాదా పుగా సగానికి పైగా పనులను ఇచ్చారు.
2022-23లో నామమాత్రంగా ఎల్పీఓలు ఇచ్చిన అధికారులు 2023-24లో 60 ఎల్పీఓలు ఇవ్వగా, గతేడాది 260 పనుల్లో దాదాపుగా 140 ఎల్పీఓలను ఒకే వ్యక్తి కుటుంబసభ్యులకు చెందిన ఫర్మ్ లకు వర్క్ ఆర్డర్లు ఇచ్చారు.
దాదాపుగా ఈ మొత్తం కోటిన్నర వరకు పనులు ఇచ్చారు. ఇక ఒక నెలలోనే దాదాపుగా రూ.10 లక్షలకు పైగా 20 ఎల్పీఓలను అందించినట్లు తెలుస్తోంది. ఇదంతా జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారి ఛోద్యం చూస్తున్నారా అన్న ప్రశ్న అందరి మెదళ్లలో నానుతుంది.