12-10-2025 12:00:00 AM
‘హమారా పైసా హమారా హిసాబ్’ అంటూ రాజస్థాన్ రాష్ర్టంలో పురుడు పోసుకున్న నినాదం మహోద్యమంగా మారి నేడు సమాచార హక్కు చట్టంగా రూపాంతరం చెందింది. పాలనలో పారదర్శకత, జవాబుదా రీతనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ప్రశ్నించే తత్వా న్ని నేర్పింది. గ్రామపంచాయతీ మొదలుకొని పార్లమెంట్ వరకు ఒక్క దరఖాస్తుతో కావలసిన సమాచారం పొందే హక్కును కల్పించింది.
కానీ అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకునే పనిలో ఉంటే మరోపక్క ప్రజా సమాచార అధికారులకు మొట్టికాయ వేసి సమాచారం ఇప్పించాల్సిన కమిషన్ కఠినంగా వ్యవహరించడం లేదు. ప్రస్తుతం సమాచార కమిషన్‌లో 17 వేల అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవ త్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ర్ట సమాచార కమిషన్ ఈ నెల 5 నుంచి 12 వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు జరపాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ప్రజా సమాచార అధికారులు..
జిల్లా అధికా రులను పిలిచి ప్రతీ అధికారి నిర్ణీత కాలంలో సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు. కానీ సమాచార హక్కు చట్టం సెక్షన్ 26 ప్రకారం పౌర సమాజానికి సమాచార హక్కు చట్టం గురించి తెలియజేయాల్సిన బాధ్యత సమాచార కమిషన్‌తో పాటు ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో సమాచార హక్కు చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చాలామందికి తెలియడం లేదు.
ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం మన రాష్ర్టంలో కేవలం ఒక్క శాతం మాత్రమే సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుంటున్నారు. సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని దరఖాస్తులు పెడుతున్నా సకాలంలో సమాచారం రాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కమిషన్‌లో ఉన్న అప్పీళ్లు, ఫిర్యాదులను విచారించాలంటే 23 సంవత్సరాలు పడుతుంది. ఈ పరిస్థితిలో సాధారణ పౌరులకు సమాచారం అందని ద్రాక్షగా మారింది.
సమాచార హక్కు చట్టం సెక్షన్ 6 కింద ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. అలాగే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)బి అన్నది చట్టానికి గుండెకాయ వంటిది. ఇందులో 17 అంశాలు ఉంటాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని అధికారుల వివరాలు, వారి విధులు, నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఆ కా ర్యాలయానికి వస్తున్న నిధులు వాటి ఖర్చు వివరాలను ప్రజలకు స్వచ్ఛందంగా తెలియజేయాలి.
రాష్ర్టంలో దాఖలవుతున్న దరఖాస్తుల్లో 60 శాతం ఈ సెక్షన్ పరిధిలో సమాచారం కోరుతూ వస్తున్నవే. కానీ జిల్లా మండల స్థాయిల్లో ప్రజా సంబంధ అధికారులు 4(1)బిని సరిగా అమలు చేయడం లేదు. కొన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టర్ భవన సముదాయంలోని వివిధ ప్ర భుత్వ యంత్రాంగాలు వారి కార్యాలయం ముందు కనీసం బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదు.
సమాచార హక్కు చట్టంపై జిల్లాస్థాయిలో మూడు నెలలకు ఒకసారి సమీక్ష చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. సమాచార కమిషనర్ల నియామకం జరిగి అప్పీళ్లు, ఫిర్యాదులు విచారణకు వచ్చినప్పుడే ప్రజా సమాచార అధికారులు సకాలంలో సమాచారం అందించగలుగుతారు. అలాగే జిల్లా స్థాయిలో సమాచార హక్కు చట్టంపై అ ధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ సామాన్యులకు సమాచా రం ఇచ్చినప్పుడే సమాచార హక్కు చట్టం మనుగడ సాధ్యమవుతుంది.
వ్యాసకర్త: అంకం నరేష్