12-10-2025 12:00:00 AM
యువతంటే మార్పును ఆశించే నవతరం. తలుచుకుంటే ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం వారి సొంతం. అలాంటి యువత నేడు దారి తప్పుతుంది. ఎవరి మాట వినకపోవడం, తమకు నచ్చిన విధంగా నడుచుకుంటామనే ధోరణి వారిలో పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో వికృత చేష్టలతో నేటి యువత ప్రమాదకరంగా మారుతున్నారు. రేసింగ్‌ల పేరుతో అడ్డగోలుగా బైక్‌లు నడిపి ప్రమాదాల బారిన పడటం, అమ్మాయిలు కనిపిస్తే వెంటపడుతూ హారన్ కొట్టడం, ఆన్‌లైన్ జూదం ఆడుతూ తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.
పాఠశాల స్థాయిలోనే కొందరు విద్యార్థులు పెడదోవపడుతున్నారు. ఇంటర్‌లోనే మందు కొడుతున్న విద్యార్థులు ఇంజినీరింగ్, డిగ్రీ, ఆపై స్థాయిలో మరిన్ని చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణి, చేతి నిండా డబ్బులు ఉండడంతో వినోదం హద్దులు దాటుతుంది. వయస్సుతో సంబం ధం లేకుండా కొత్త అనుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. టీనేజీ మత్తులో తాము ఏం చేస్తున్నామనే విషయం మరిచిపోతున్న యువత నడి రోడ్లపైనే బర్త్ డే వేడుకల పేరుతో కేక్ కటింగ్‌లు చేయడం, బర్త్ డే బంప్స్ పేరుతో కొట్టడం చేస్తున్నారు.
గత నెలలో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటనే ఇందుకు ఉదాహరణ. 9వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థిపై పుట్టిన రోజు వేడుకల పేరుతో సహచర విద్యార్థులు పిడి గుద్దులు కురిపించారు. బర్త్ డే బంప్స్ పేరుతో ఇష్టమొచ్చిన రీతిలో విద్యార్థి ప్రైవేట్ పార్ట్స్ సహా ఎక్కడ పడితే అక్కడ బలంగా కొట్టారు. దీంతో అపాస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ విద్యార్థి ప్రస్తుతం బెడ్‌రెస్ట్‌లో ఉన్నాడు.
కేసు నమోదు చేసి చర్యలు తీసుకుందామన్నా విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందేమోనని పోలీసులు కూడా హెచ్చరికతో వదిలేయాల్సి వచ్చింది. ఇది చాలదన్నట్టు యువత బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ వెళ్లడం, పోలీసులకు దొరకద్దనే ఉద్దేశంతో వాహనాలను వేగంగా నడిపి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక రోడ్లపై యువత బైక్‌లు, కార్లు నడుపుతున్న విధానం కూడా ఒళ్లు జలదరించేలా ఉంటున్నాయి.
తాము నడిపే వాహనాలకు సైలెన్సర్లు పీకేయడం, వింత హారన్ సౌండ్లతో మిగతా ప్రయాణికుల గుండెల్లో దడ పుట్టేలా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో బైక్‌లు నడుపుతూనే మొబైల్ ఫోన్లు చూడడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, ఇయర్ బడ్స్ పెట్టుకొని చెవులు పాడయ్యేలా పెద్ద సౌండ్‌తో పాటలు వినడం లాంటివి కూడా ఎక్కువైపోయాయి. దీనివల్ల డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోతున్న యువత యాక్సిడెంట్‌లకు కార ణంగా మారుతున్నారు. అటుగా వెళ్లే వాహనదారులు అదేంటని ప్రశ్నిస్తే తిరిగి వారిపైనే ఎదురుదాడి చేస్తున్న ఘటనలు కోకొల్లలు.
ఇటీవలే హైదరాబాద్ కొత్త కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్ ఇకపై ఇయర్ బడ్స్ పెట్టుకొని వాహనం నడిపినా, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేసినా జరిమానాలతో పాటు లైసెన్స్ రద్దు చేయడంతో పాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుందని హెచ్చరించారు. జీవితమంటే సరదాలు, షికార్లు మాత్రమే కాదు.. యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుగు సాగేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరముంది.
కళాశాలల యాజమాన్యాలు కూడా విద్యార్థుల తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తే బాగుంటుంది. ఇకనైనా యువత చెడు మార్గాన్ని వదిలి ఒక లక్ష్యంతో మంచి మార్గంలో నడవాలని ఆశిద్దాం.